Elon Musk: స్టాక్‌మార్కెట్‌ ఢమాల్‌.. క్రిప్టో గోవిందా.. వాట్‌నెక్ట్స్‌?

15 Jun, 2022 15:37 IST|Sakshi

సంపదను సృష్టించే స్టాక్‌ మార్కెట్ మంచు పర్వతంలా కరిగిపోతుంది. తారాజువ్వలా ఎగిసిపడే మార్కెట్‌ సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. భవిష్యత్తు తమదే అంటూ గప్పాలు కొట్టుకున్న క్రిప్టో మార్కెట్‌ కుదేలైంది. పెట్టుబడికి ప్రధాన సాధానాలుగా చెప్పుకునే ఒక్కో రంగం నష్టాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. ఈ తరుణంలో తిక్కతిక్కగా వ్యవహారించినా భవిష్యత్తును పక్కాగా అంచనా వేస్తాడనే పేరున్న ఎలన్‌ మస్క్‌ నెక్ట్స్‌ సంక్షోభం ఏ రంగంలో రాబోతుందనే అంశంపై స్పందించారు. 

కరోనాతో మొదలు
కరోనా వైరస్‌ తెచ్చిన కష్టాలతో ప్రపంచ దేశాలు నెమ్మదిగా ఆర్థిక సంక్షోభం వైపుగా అడుగులు వేస్తున్నాయి. ఈ తరుణంలో తెర మీదకు వచ్చిన రష్యా ఉక్రెయిన్‌ వార్‌ మరింత చేటు తెచ్చింది. ఫ్యూయల్‌ ధరలు అడ్డగోలుగా పెరిగిపోయాయి. కరోనా కారణంగా సరఫరా వ్యవస్థలో తలెత్తిన సమస్యలు మరింతగా ముదిరాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. వీటికి సంబంధించిన ఫలితాలు స్టాక్‌ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

సంపద ఆవిరవుతోంది
ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీంతో ప్రపంచ కుబేరుల సంపద హరించుకుపోతుంది. గడిచిన ఆరు నెలల్లో ఎలాన్‌ మస్క్‌ 100 బిలియన్‌ డాలర్లు, జెప్‌ బేజోస్‌ 66 బిలియన్‌ డాలర్లు, బిల్‌గేట్స్‌ 24 బిలియన్‌ డాలర్లు, వారెన్‌ బఫెట్‌ 6 బిలియన్‌ డాలర్లు నష్టపోయారు. మరోవైపు బిట్‌ కాయిన్‌, ఈథర్‌, సోలానో వంటి క్రిప్టో కరెన్సీలు నేల కరుచుకుపోయాయి. దీంతో క్రిప్టోకు వ్యతిరేకంగా వినిపిస్తున్న గళాల సంఖ్య పెరిగింది. 

నకమోటో ఏమన్నారంటే
స్టాక్‌మార్కెట్‌, క్రిప్టోలు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో తదుపరి ఏ రంగంలో నష్టాలు సంభవించే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. డోజోకాయిన్‌ సృష్టికర్త షిబెటోషి నకమోటో ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. అందులో హాలోవీన్‌ స్క్రీమ్‌ ముందుగా స్టాక్‌మార్కెట్‌ను, ఆ తర్వాత క్రిప్టో కరెన్సీని నాశనం చేసిందని ఫోటోను పోస్ట్‌ చేశారు.

మస్క్‌ సైతం అదే మాట
నకమోటో అభిప్రాయం ప్రకారం ఇప్పటికే స్టాక్‌మార్కెట్‌, క్రిప్టోలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని వాటి తర్వాత నష్టపోయే రంగం రియల్టీ అంటూ హాలోవీన్‌ మీమ్‌ ద్వారా తెలిపారు. అవునంటూ కొందరు మిగిలిన రంగాలను సూచిస్తూ మరికొందరు కామెంట్‌ చేశారు. కానీ గత ఆరునెల్లలో ఎక్కువ సంపదను కోల్పోయిన వ్యక్తిగా ప్రపంచ కుబేరుడిగా ఎలన్‌మస్క్‌ ఏం చెబుతారనే ఆసక్తి నెలకొంది. నకమోటో అభిప్రాయంతో ఎలాన్‌మస్క్‌ కూడా ఏకీభవిస్తూ. రాబోయే రోజుల్లో రియల్టీలో భారీ నష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

చదవండి: భారత్‌తో డీల్‌ జాప్యం.. టెస్లాకు భారీ షాక్‌, మనుజ్‌ ఖురానా రాజీనామా!

మరిన్ని వార్తలు