ఎలన్‌ మస్క్‌ వర్సెస్‌ జెఫ్‌ బెజోస్‌.. దావాల విషయంలో కౌంటర్‌ వ్యాఖ్యలు

30 Sep, 2021 08:14 IST|Sakshi

Elon Musk Jeff Bezo Rival: పోటీ ప్రపంచంలో పోటాపోటీ విమర్శలూ సహజమే. కానీ, అవి విపరీతానికి చేరితేనే వెగటు పుడుతుంది. బిలియనీర్లు ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ జెజోస్‌ల మధ్య మాటల వైరం రోజురోజుకీ శ్రుతి మించుతోంది. వీలు దొరికినప్పుడల్లా బెజోస్‌పై పరోక్షంగా విరుచుకుపడుతున్న మస్క్‌.. తాజాగా మరోసారి దురుసు వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో అవతలి నుంచి కూడా కౌంటర్‌ పడడం విశేషం. 

ప్రైవేట్‌ స్పేస్‌ ఏజెన్సీ బ్లూ ఆరిజిన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌(అమెజాన్‌ బాస్‌) న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని స్పేస్‌ఎక్స్‌ ప్రయోగాలను నెమ్మదించేలా  చేస్తున్నాయని ఆరోపించాడు ఎలన్‌ మస్క్‌. 2021 కోడ్‌ కాన్ఫరెన్స్‌లో బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేశాడాయాన.  ‘‘నీ తరపు లాయర్లు ఎంత గొప్పవాళ్లైనా కావొచ్చు. చంద్రుడి చేరాలనే మా ప్రయత్నాన్ని ఎన్ని దావాలేసినా ఆపలేరు. అంతరిక్ష యానం నీ అబ్బసొత్తు కాదు’’ అంటూ ఒకానొక దశలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు మస్క్‌. ఇదిలా ఉంటే స్పేస్‌ఎక్స్‌, స్టార్‌లింక్‌ కార్యకలాపాలను అడ్డుకునేందుకు బ్లూ ఆరిజిన్‌ వరుసగా దావాలు వేస్తోందన్నది ఎలన్‌ మస్క్‌ చేస్తున్న ప్రధాన ఆరోపణ. 

అమెజాన్‌ కౌంటర్‌
మస్క్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే అమెజాన్‌ నుంచి కౌంటర్‌ పడింది.  ఎలన్‌ మస్క్‌ తాను బెజోస్‌ లాంటోడేనని గుర్తించ లేకపోతున్నాడంటూ సెటైర్‌ వేసింది. గతంలో స్పేస్‌ఎక్స్‌ వేసిన దావాలకు సంబంధించిన చిట్టాను బయటపెట్టింది అమెజాన్‌. ఈ మేరకు అమెరికన్‌ టెక్నాలజీ బ్లాగ్‌ ది వర్జ్‌కు సంబంధిత డాక్యుమెంట్లను పంపించింది.

స్పేస్‌ఎక్స్‌ ఇప్పటిదాకా వివిధ కోర్టుల్లో వేసిన 13 దావాలు, అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లు, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేసిన స్టేట్‌మెంట్ల తాలుకా వివరాలను వెల్లడించింది. 2004 నుంచి అమెరికా ప్రభుత్వం,  నాసా, యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌లకు వ్యతిరేకంగా స్పేస్‌ఎక్స్‌ దాఖలు చేసిన పిటిషన్లు ఇందులో ఉన్నాయి.

అమెజాన్‌ శాటిలైట్‌ డివిజన్‌ ప్రతినిధి ప్రాజెక్ట్ కుయిపర్‌ పేరు మీద ఈ డాక్యుమెంట్లు వర్జ్‌కు వచ్చాయి. ‘‘ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పని చేసిన స్పేస్‌ఎక్స్‌.. గతంలో చేసింది ఇదే కదా. ఏకంగా ప్రభుత్వంపైనే బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది’’ అని కుయిపర్‌ పేరు మీద స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ అయ్యింది. మొత్తం 39 డాక్యుమెంట్లు ఉండగా, వాటిని 13 పేజీల(పీడీఎఫ్‌ ఫైల్‌రూపంలో) కుదించి పంపించారు.

సెటైర్‌
అయితే తమ దావాల వ్యవహారాన్ని స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ సమర్థించుకున్నాడు. ‘‘మేం పోటీప్రపంచంలోకి అనుమతించాలని స్పేస్‌ఎక్స్‌ తరపున దావాలు వేశాం. కానీ, బీవో(బ్లూఆరిజిన్‌ను ఉద్దేశించి) అసలు పోటీయే ఉండకూడదని దావాలు వేస్తోంది’’ అని వ్యంగ్యం ప్రదర్శించాడు.  ఇక న్యాయపరమైన చర్యలతో బ్లూ ఆరిజిన్‌ కంపెనీ తనకు మోకాలు అడ్డుపెట్టడంపై  ఎలన్‌ మస్క్‌ ఘాటుగానే స్పందిస్తున్నాడు. బహుశా తమపై కేసులు వేయడానికే బ్లూ ఆరిజిన్‌ బాస్‌ జెఫ్‌ బెజోస్‌ అమెజాన్‌ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుని ఉంటాడంటూ గతంలో సెటైర్లు సైతం పేల్చాడు.

చదవండి: ఇద్దరూ ఇద్దరే.. వీళ్ల చర్యలు ఊహాతీతం

మరిన్ని వార్తలు