ట్విట్టర్‌కే ‘శీల’ పరీక్ష పెట్టిన ఎలన్‌మస్క్‌

25 Mar, 2022 14:19 IST|Sakshi

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. నరులెవరూ నడవనిది ఆ దార్లో నే నడిచెదరో అనే కౌబాయ్‌ పాటకి రియల్‌ టైం బిజినేస్‌మేన్‌ రూపం ఇస్తే అది ఎలన్‌మస్క్‌ అవుతాడనేది జగమెరిగిన సత్యం. కొత్త దారిలో ప్రయాణించడం ఎవరెమనుకుంటారో అని సందేహించకుండా నిర్మోహమాటంగా మాట్లాడటం ఎలన్‌ మస్క్‌ నైజం. ఈ క్రమంలో కొన్ని సార్లు చిక్కుల్లో పడ్డా ఆయనెక్కడా వెనక్కి తగ్గలేదు. 

తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడిపై కూడా ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించాడు. బస్తీ మే సవాల్‌ అంటూ రష్యా అధ్యక్షుడికి ఛాలెంజ్‌ విసిరాడు. దీనికి రష్యా వైపు నుంచి కూడా రిటార్ట్‌ వచ్చింది. ఇలా సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత ఉక్రెయిన్లకు అండగా ఉండేందుకు స్టార్‌లింక్‌ ద్వారా నెట్‌ సౌకర్యం కల్పించాడు ఎలన్‌మస్క్‌. ఈ నేపథ్యంలో కూడా రష్యా - ఉక్రెయిన్‌ వార్‌ను ఉద్దేశించి పలు ట్వీట్లు చేశాడు ఎలన్‌మస్క్‌. ఈ ట్వీట్లపై ట్విట్టర్‌ యాజమాన్యం ఎక్కడా అభ్యంతర పెట్టిన దాఖలాలు కూడా కనిపించలేదు.

మరేం జరిగిందో తెలియదు కానీ తాజాగా ట్విట్టర్‌ పైనే బాణాలు ఎక్కు పెట్టాడు ఎలన్‌మస్క్‌, ప్రజాస్వామ్యానికి ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ ఎంతో ముఖ్యమైనదని పేర్కొంటూ ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ట్విట్టర్‌ కట్టుబడి ఉందా అని​ ప్రశ్నిస్తూ ట్విట్టర్‌లోనే ఓటింగ్‌ పెట్టాడు. ట్వీట్‌ చేసిన గంట వ్యవధిలోనే నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రెండున్నర లక్షల మందికి పైగా ఈ ఓటింగ్‌లో ఇప్పటి వరకు పాల్గొనగా.. అందులో దాదాపు 65 శాతం మంది కాదంటూ బదులిచ్చారు. రేపటి వరకు ఈ ఓటింగ్‌ కొనసాగనుంది.

>
మరిన్ని వార్తలు