సీరియస్‌ ఇష్యూపై సిల్లీ రియాక్షన్‌! ఇదే ఫైనల్‌ వార్నింగ్‌ అంటూ..

23 Nov, 2021 15:26 IST|Sakshi

Elon Musk Warns To JP Morgan: అమెరికా వ్యాపార దిగ్గజం ఎలన్‌ మస్క్‌ వెరైటీ వార్నింగ్‌కు దిగాడు. అమెరికా బ్యాంకింగ్‌ దిగ్గజ కంపెనీ జేపీ మోర్గాన్‌ చేజ్‌, టెస్లాపై వేసిన దావాను వెనక్కి తీసుకోవాలని, లేని తరుణంలో తన ప్రతీకార చేష్టలు ఊహించని రేంజ్‌లో ఉంటాయని బెదిరిస్తున్నాడు. 


2014లో జరిగిన ఒక ఒప్పందానికి సంబంధించి(బ్యాంకుకు అమ్మిన వారెంట్ల విషయంలో) ఉల్లంఘనలకు పాల్పడింది టెస్లా. దీంతో గతవారం  జేపీ మోర్గాన్‌ చేజ్‌, టెస్లా మీద దక్షిణ న్యూయార్క్‌ న్యాయస్థానంలో దావా వేసింది(నవంబర్‌ 15న). మొత్తం 162 మిలియన్‌ డాలర్ల దావా ఇది. అయితే చెల్లింపులకు సంబంధించి టెస్లాకు చాలా అవకాశాలు ఇచ్చి చూశామని, కానీ అవతలి నుంచి స్పందన లేకపోవడంతో కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని జేపీమోర్గాన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.
  
 

అయితే మస్క్‌ ఈ దావా వ్యవహారాన్ని చాలా తేలికగా తీసుకున్నాడు. అంతేకాదు  జేపీ మోర్గాన్‌ గనుక కేసును వెనక్కి తీసుకోకపోతే యెల్ప్‌(అమెరికాలో బిజినెస్‌ వ్యవహారాలకు సంబంధించిన జనాలు రివ్యూలు ఇచ్చే వెబ్‌సైట్‌) లో జేపీమోర్గాన్‌ను వన్‌స్టార్‌ రేటింగ్‌ రివ్యూ ఇస్తానని, ఈ వ్యవహారంలో ఇదే తన చివరివార్నింగ్‌ అంటూ బెదిరింపులకు దిగాడు ఎలన్‌ మస్క్‌. 

అసలు విషయం ఏంటంటే..
జేపీ మోర్గాన్‌తో టెస్లాకు సత్సంబంధాలు లేకపోయినా.. గత ఏడేళ్లుగా చిన్నస్థాయి బిజినెస్‌లు నడుస్తున్నాయి. కానీ,  జేపీ మోర్గాన్‌ చేస్‌ సీఈవో జేమీ డిమోన్‌కు ఎలన్‌ మస్క్‌కు అస్సలు పొసగడం లేదు. దీంతో 2016 నుంచి ఆర్థిక సంబంధమైన లావాదేవీలు మాత్రం నడవడం లేదు. ఇక 2014లో జేపీ మోర్గాన్‌ సహకారంతోనే టెస్లా పటిష్టం అయ్యింది. అయితే 2018లో గంజాయి మోజుతో మస్క్‌ చేసిన ఓ ట్వీట్‌.. టెస్లా షేర్ల ధరల్ని ఆకాశానికి చేర్చింది. ఈ వ్యవహారంపై అదే ఏడాది అక్టోబర్‌లో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ కమిషన్‌ (SEC) టెస్లా, ఎలన్‌ మస్క్‌లకు 20 మిలియన్‌ డాలర్ల ఫైన్‌ విధించింది కూడా.

అప్పటి నుంచి బ్యాంక్‌ చెల్లింపుల ఒప్పందం ఉల్లంఘనకు సంబంధించిన వ్యవహారంపై జేపీ మోర్గాన్‌ -టెస్లా మధ్య జగడం నడుస్తోంది. తాజాగా జేపీ మోర్గాన్‌ కోర్టును ఆశ్రయించగా.. టెస్లా మాత్రం ఆ విషయాన్ని లైట్‌ తీస్కుంటూ వస్తోంది. ఈ తరుణంలో విషయం కోర్టుకు చేరినప్పటికీ ఈ వ్యవహారాన్ని మాత్రం కామెడీగా తీసుకుంటున్నాడు ఎలన్‌ మస్క్‌.

మరిన్ని వార్తలు