సక్సెస్‌ను గుర్తు చేసుకున్న బెజోస్‌.. అయినా వదలని ట్రోల్‌ రాజా

12 Oct, 2021 12:06 IST|Sakshi

అవతలి వాడి గెలుపును వెన్నుదట్టి అభినందించడం ఒక హుందాతనం. కానీ, ఇప్పడది మచ్చుకైనా కనిపించడం లేదు. ఎంతసేపు నెగెటివిటి చుట్టూరానే తిరుగాడుతోంది పోటీ ప్రపంచం. 


ప్రపంచ కుబేరులైన ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌లు ఒకరి లోటుపాట్లను మరొకరు ఎత్తుచూపిస్తూ విమర్శలకు దిగడం కొత్తేం కాదు. ఈ విషయంలో అప్పుడప్పుడు బెజోస్‌ కొంచెం తగ్గి ఉంటున్నప్పటికీ.. మస్క్‌ మాత్రం ‘తగ్గేదేలే’దని అంటాడు. తాజాగా బెజోస్‌ ఓ ట్వీట్‌ చేస్తే దాని మీద వెటకారం ప్రదర్శించాడు ఎలన్‌ మస్క్‌. ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రపంచానికి ఒకరకంగా ఆజ్యం పోసింది అమెజాన్‌ సర్వీస్‌. అంతటి గొప్ప ఆలోచన వెనుక బెజోస్‌లాంటి మేధావి బుర్ర ఉందనేది తెలిసిందే.

అదే ఆయన్ని ఇప్పుడు ప్రపంచ కుబేరుడిలో ఒకరిగా బెజోస్‌ను నిలబెట్టింది. అయితే ఆరంభంలో ఆయన్ని, ఆయన అమెజాన్‌ ఆలోచనను కొన్ని మీడియాహౌజ్‌లు నీరుగార్చే ప్రయత్నం చేశాయట. అమెజాన్‌ ప్లాన్‌ విఫలమై తీరుతుందంటూ జోస్యం చెప్పాయి కూడా. ఈ మేరకు 1999లో బారోన్స్‌ వీక్లీ ప్రచురించిన ఓ కథనాన్ని బెజోస్‌ ప్రస్తావించాడు.

పోటీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌ చైర్మన్‌ రీడ్‌ హాస్టింగ్స్‌ సైతం బెజోస్‌ ట్వీట్‌కు సానుకూలంగా స్పందించడం విశేషం. కానీ, ఎలన్‌ మస్క్‌ మాత్రం ఇక్కడా తనదైన వెటకారాన్నే ప్రదర్శించాడు. బెజోస్‌ ట్వీట్‌ కింద.. సిల్వర్‌ మెడల్‌ బొమ్మను ఉంచాడు.

అత్యంత ధనికుల జాబితాలో ఈమధ్యే ఎలన్‌ మస్క్‌, బెజోస్‌ను వెనక్కినెట్టి మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిల్వర్‌ మెడల్‌ ఎమోజీ ద్వారా ‘నెంబర్‌ టు’ అంటూ చెప్పకనే వెటకారం ప్రదర్శించాడు. దీంతో మస్క్‌ వ్యవహారశైలి గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక ఇన్‌స్పిరేషన్‌4 ద్వారా ఎలన్‌ మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ అంతరిక్ష ప్రయోగం విజయవంతంగా పూర్తైన సందర్భంలో బెజోస్‌.. స్పేస్‌ఎక్స్‌ను అభినందించిన విషయం తెలిసిందే. 

చదవండి: అపర కుబేరులు.. పిసినారులు కూడా!

మరిన్ని వార్తలు