‘నిద్ర పోండి..సంపాదించండి’, ట్విటర్‌ ఆఫీస్‌లో ఎలాన్‌ మస్క్‌ సరికొత్త ప్రయోగం!

6 Dec, 2022 19:32 IST|Sakshi

సీఈవో ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ కార్యాలయాన్ని ఉద్యోగులు నిద్రపోయేలా మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం..శాన్‌ఫ్రాన్సిస్కో మార్కెట్‌ స్ట్రీట్‌ 900లో ఉన్న ప్రధాన కార్యాలయంలో ట్విటర్‌ మొత్తం 7 ఫ్లోర్లలో కార్యకలాపాలు నిర్వహిస‍్తుంది.

ఇప్పుడు అదే ఆఫీస్‌లో ఉద్యోగుల కోసం ఒక్కో ఫ్లోర్‌లో 4 నుంచి 8 బెడ్‌ రూమ్‌ పాడ్స్‌ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు చిన్న చిన్న రూములుగా విభజించి ఉద్యోగులకు బెడ్స్‌,కర్టన్లు, టెలిప్రెసెన్స్ మానిటర్స్‌తో కాన్ఫరెన్స్‌ రూమ్‌ తరహాలో డిజైన్‌ చేసినట్లు ఫోర్బ్స్‌ నివేదిక  వెల్లడించింది. 

అయితే ట్విటర్‌ ఆఫీస్‌ను మస్క్‌ ఇలా ఎందుకు మార్చారనేది స్పష్టలేదు. కానీ కొద్దిరోజుల క్రితం మస్క్‌ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్ధిక అనిశ్చితి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన మస్క్‌..ఉద్యోగులు నిద్రాహారాలు పని చేయాలని కోరారు. 

కోరడమే కాదు ఉద్యోగుల నుంచి మెయిల్‌ రూపంలో హామీ కూడా తీసుకున్నారు.  హార్డ్‌ కోర్‌ ఉద్యోగులైతే తన మెయిల్‌కు ఎస్‌ అని మాత్రమే రిప్లయి ఇచ్చేలా ఆప్షన్‌ ఇచ్చారు. అందుకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులు రోజుకు 12గంటలు సంస్థ కోసం వెచ్చించాలని లేదంటే దివాలా తీసే అవకాశం ఉందని హెచ్చరించారు.  రిప్లయి ఇవ్వని ఉద్యోగులు మూడు నెలల నోటీస్‌ పీరియడ్‌తో సంస్థను వదిలి వెళ్లాలని చెప్పారు. 

ఈ నేపథ్యంలో ట్విటర్‌ ఆఫీస్‌ను బెడ్‌రూమ్‌లుగా మార్చడం ఆసక్తికరంగా మారింది. సంస్థ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న ఉద్యోగులు అక్కడే నిద్ర పోయేలా ఏర్పాట్లు చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు