Elon Musk - Twitter Deal: ట్విటర్‌కి బ్రేకప్‌ చెప్పిన ఈలాన్‌ మస్క్‌?

17 May, 2022 13:34 IST|Sakshi

అనుకున్నట్టే అయ్యింది. ఊహించిందే జరిగింది. అటు ఇటు పల్టీలు కొట్టిన ఈలాన్‌మస్క్‌ చివరకు ట్విటర్‌ టేకోవర్‌కు రాంరాం అంటున్నాడు. నేరుగా ఈ విషయం ప్రకటించకపోయినా.. డీల్‌ను బ్రేక్‌ చేసేందుకు అవసరమైన పాయింట్‌ను పట్టుకున్నాడు.

ఫేక్‌ ఖాతాలకు సంబంధించి ట్విటర్‌ సరైన సమాచారం ఇవ్వడం లేదని, దీనిపై స్పష్టత వచ్చే వరకు ట్విటర్‌ను టేకోవర్‌ చేయడం కుదరదు అంటూ కొత్త రాగం అందుకున్నాడు. ట్విటర్‌ మొత్తం అకౌంట్లలో ఫేక్‌ ఖాతాలు 5 శాతం ఉంటాయని సీఈవో పరాగ్‌ చెబుతున్నాడు. కానీ ఫేక్‌ ఖాతాలు 20 శాతం వరకు ఉంటాయంటూ ఆరోపించాడు. సీఈవో చెప్పిన నంబర్‌ కంటే నాలుగురెట్టు అధికంగా ఫేక్‌ ఖాతాలు ఉన్నాయంటూ ఫైర్‌ అయ్యాడు ఈలాన్‌మస్క్‌. 

తగ్గేదేలే
నిజమైన ఖాతాదారుల సంఖ్యను బట్టే తాను ట్విటర్‌ కొనుగోలుకు 44 బిలియన్‌ డాలర్లు ఇస్తానంటూ తాను ఆఫర్‌ ఇచ్చినట్టు తెలిపాడు. ఇప్పుడు ఈ కంపెనీ సీఈవో చెప్పిన సంఖ్యకు నాలుగింతలు ఫేక్‌ ఖాతాలు ఉన్నాయని, దీనిపై క్లారిటీ రావాల్సిందే అంటున్నాడు. అప్పటి వరకు ట్విటర్‌ టేకోవర్‌ డీల్‌లో అడుగు ముందుకు పడదంటూ ఖరాఖండీగాక చెప్పాడు. 20 శాతం ఫేక్‌ ఖాతాలు ఉన్న సంస్థకు అంత డబ్బు పెట్టి కొనడం అంటే అధికంగా ధర చెల్లించినట్టే అనే అర్థంలో ఈలాన్‌మస్క్‌ ట్వీట్‌ చేశాడు.

పరాగ్‌ ఎమన్నారంటే
మరోవైపు ఫేక్‌ ఖాతాలు రోజుకో రూపంలో వస్తూనే ఉంటాయని, ఇవి మనుషులు ఆటోమేషన్‌ పద్దతిలో ఎంతో పకడ్బంధీగా పుట్టుకొస్తూనే ఉంటాయని ట్విటర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. ఫేక్‌ ఖాతాల ఏరివేత కార్యక్రమం ఎప్పటిప్పుడు పక్కా చేపడుతున్నామన్నారు. ఫేక్‌ ఖాతాలు ఎన్ని ఉన్నాయో నిర్దారించేందుకు బయటి వ్యక్తులకు అనుమతి ఇవ్వబోమన్నారు. దీంతో ట్విటర్‌ డీల్‌లో పీటముడి పడింది. ఇరు వర్గాలు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.దీంతో డీల్‌ ఇక అటకెక్కినట్టే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

చదవండి: ఈలాన్‌మస్క్‌ వర్సెస్‌ పరాగ్‌ అగ్రవాల్‌.. ట్విటర్‌లో ముదురుతున్న వివాదం

మరిన్ని వార్తలు