ట్విటర్‌లో ఉద్యోగాల కోతలు షురూ

31 Oct, 2022 07:09 IST|Sakshi

న్యూయార్క్‌: మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్విటర్‌ను సొంతం చేసుకున్న ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ .. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టారు.

ఉద్యోగులు ఎక్కువగా ఉన్న విభాగాలను భారీగా కుదించడంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం తొలగించతగిన ఉద్యోగుల జాబితాను నవంబర్‌ 1 లోగా తయారు చేయాలంటూ కొందరు మేనేజర్లకు ఆయన ఆదేశాలు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎందుకంటే, సంస్థ విధానాల ప్రకారం నవంబర్‌ 1న ఉద్యోగులకు జీతభత్యాల్లో భాగంగా స్టాక్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని, ఈలోపే తొలగిస్తే ఆ మేరకు భారం తగ్గించుకోవచ్చని మస్క్‌ భావిస్తున్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి.  

ప్రస్తుతం కంపెనీలో 7,500 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ట్విటర్‌ను మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కొనుగోలు సమయంలోనే 75 శాతం మంది ఉద్యోగులను తీసేస్తానని మస్క్‌ అన్నట్లుగా వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లుగా వచ్చీ రాగానే సీఈవో పరాగ్‌ అగ్రవాల్‌ సహా నలుగురు టాప్‌ ఉద్యోగులపై వేటు వేయడం .. తాజాగా ఉద్వాసనలు భారీగానే ఉంటాయన్న వార్తలకు ఊతమిస్తున్నాయి. 

మరోవైపు, ట్విటర్‌లో పోస్ట్‌ అయ్యే కంటెంట్‌ను సమీక్షించేందుకు ’కంటెంట్‌ మోడరేషన్‌ కౌన్సిల్‌’ ఏర్పాటు చేస్తామని మస్క్‌ వెల్లడించారు. కంటెంట్‌పరంగానూ, ఖాతాల పునరుద్ధరణ విషయంలోనూ పెద్ద నిర్ణయాలేవైనా అవసరమైతే ఈ కౌన్సిలే తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు