వాటిపై మస్క్‌ క్షమాపణ: లేవు లేవంటూనే మళ్లీ ఉద్యోగాల కోత!

23 Feb, 2023 16:24 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రపంచ కుబేరుడు, ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ కోతలు లేవు...లేవంటూనే మరోసారి ఉద్యోగాలపై వేటు వేశాడు. సేల్స్‌ ఇంజనీరింగ్ విభాగాలలో పలువురు ఉద్యోగులను తొలగించాడు.  వీరిలో ఒకరు  నేరుగా మస్క్‌కి రిపోర్ట్ చేస్తున్న ఉద్యోగి కావడం గమనార్హం.

ది వెర్జ్‌ నివేదిక ప్రకారం సేల్స్, ఇంజనీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులను కంపెనీ గత వారం తొలగించింది. ఉద్యోగుల తొలగింపునకు కారణాలు తెలియరాలేదు.అయితే ట్విటర్‌ యాడ్స్‌, బిజినెస్‌ విధానాన్ని మెరుగుపర్చాలని ఉద్యోగులను కోరారని, అందుకు వారికి వారం రోజులు గడువు ఇచ్చినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  'ట్విటర్ 2.0'లో యాడ్స్ మానిటైజేషన్ మేనేజర్‌ మార్సిన్ కడ్లుజ్కాతన ఉద్యోగం పోయిన విషయాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. “థ్యాంక్యూ  ట్వీప్స్. ట్విటర్‌లో 7 సంవత్సరాల  సర్వీసుకు ముగింపు!  అని  ట్వీట్‌ చేశారు. ట్విటర్‌లో యాడ్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ వారం రోజుల్లో సాధ్యంకాదని, కనీసం రెండు మూడు నెలలు పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఎలాన్ మస్క్ క్షమాపణ
ట్విటర్‌ యూజర్లను ఇబ్బంది పెడుతున్న సంబంధం లేని బాధించే ప్రకటనలపై ఇటీవల మస్క్‌ క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించి అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని, గూగుల్ సెర్చ్ మాదిరిగా  ట్వీట్‌లలోని కీలకపదాలు, టాపిక్స్‌ ఆధారంగా యాడ్స్‌ వస్తున్నాయంటూ వివరణ ఇచ్చారు. 

కాగా 44 బిలియన్‌ డాలర్లతో  ట్విటర్‌ను కొనుగోలు చేసి టెస్లా సీఈవో మస్క్‌ వేలాదిమందిని తొలగించారు. ముఖ్యంగా మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు  ఇతర  కీలక ఎగ్జిక్యూటివ్‌లను ఇంటికి పంపారు. అలాగే 2022, నవంబరు తర్వాత కంపెనీలో ఎలాంటి తొలగింపులు ఉండవని హామీ ఇచ్చారు. అయితే, అప్పటి నుంచి మరో రెండు దఫాలుగా ఉద్యోగులను తొలగించగా, ఇది మూడోసారి. అలాగే ఇండియాలో ముంబై, ఢిల్లీ ట్విటర్‌ ఆఫీసులును కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు