‘ట్విటర్‌లో ఏం జరుగుతోంది!’.. వచ్చే వారంలో భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు!

20 Nov, 2022 16:06 IST|Sakshi

ట్విటర్‌ను మరింత ప్రక్షాళన చేసే దిశగా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాస్‌గా అవతారం ఎత్తిన వారం రోజుల్లో టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లను ఇంటికి సాగనంపారు. మస్క్‌ పోరు పడలేక 1200మంది రాజీనామా చేశారు. అయినా సరే ఖర్చులు తగ్గించుకునేందుకు వచ్చే వారంలో మరింత మంది ఉద్యోగులకు పింక్‌ స‍్లిప్‌లు ఇవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 
 
మస్క్‌..ఏ ముహూర్తానా ట్విటర్‌ కంపెనీని సొంతం చేసుకున్నారో ఏమో కానీ..అప్పటి నుంచే ఉద్యోగుల కుర్చీకింద కుంపట్లు వచ్చి పడ్డాయి. ఓనర్‌గా ట్విటర్‌లోకి అడుగు పెట్టీ పెట్టకముందే...సంస్థలోనే సగం మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపేందుకు మూహుర్తం పెట్టుకున్నారు. అలా ఉద్యోగుల్ని తొలగించకపోతే కంపెనీ దివాళా తీస్తోందని హెచ్చరించారు. వచ్చీ రావడంతోనే తనకు నచ్చని ఉద్యోగుల్ని పీకేశారు. తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసుకున్నారు. 

ఆ క్రమంలోనే కష్టపడి పనిచేస్తారా? ఇంటికి వెళ్లి పోతారా? అని ఉద్యోగులకు బెదిరింపు మెయిల్‌ పెట్టారు. దీంతో ‘చీటికి మాటికి ఉద్యోగం పీకేస్తామనే వాడు ఏం బాసు. అటువంటి బాస్‌ వద్ద పనిచేస్తే ఎంత? చేయకపోతే ఎంత? అని అనుకున్న మెజార్టీ ఉద్యోగులు నువ్వూ వద్దు..నీ ఉద్యగోమూ వద్దు నీకో దండం అంటూ’ ఏకంగా 1200మంది రాజీనామా చేశారు. వారిలో ఇంజనీర్లు, డెవలపర్లు, కోడర్లు ఉన్నారు. 

తాజాగా ట్విటర్‌ బాస్‌ మస్క్‌ వచ్చే వారంలో సేల్స్‌ & రిలేషన్‌ షిప్‌ విభాగానికి చెందిన ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనున్నారని సమాచారం. అందుకు ఊతం ఇచ్చేలా సంస్థలోని పలు విభాగాలకు మేనేజర్‌ స్థాయి సిబ్బంది..ఉద్యోగుల్ని తొలగించేలా అంగీకరించాలని కోరుతున్నారు. వారు అందుకు అంగీకరిస్తే వచ్చే వారంలో ట్విటర్‌లోని మరింత మంది ఉద్యోగులు ఇంటికి వెళ్లనున్నారు. 

ఒప్పుకోకపోతే ఇంటికే 
ఇక ఉద్యోగుల తొలగింపుకు ఆయా విభాగాలను మేనేజ్‌ చేసే టీం లీడర్లు ఒప్పుకోక పోతే వారిపైనే మస్క్‌ వేటు వస్తున్నారు. ఇప్పటికే మార్కెటింగ్, సేల్స్ విభాగానికి చెందిన రాబిన్ వీలర్,మ్యాగీ సునీవిక్ మస్క్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించారు కాబట్టే వారు ఉద్యోగాలు కోల్పోయారన్న విషయం తెలిసిందే. 

చదవండి👉‘బాబ్బాబూ ఒక్కసారి రావూ’..ఉద్యోగుల్ని బ్రతిమిలాడుతున్న ఎలాన్‌ మస్క్‌!

మరిన్ని వార్తలు