ట్విటర్‌ డీల్‌: ఈలాన్‌  మస్క్‌ మరో బాంబు

6 Jun, 2022 20:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, బిలియనీర్‌ ఈలాన్‌ మస్క్‌ మరోసారి ట్విటర్‌కు హెచ్చరిక జారీ చేశాడు. స్పామ్‌, నకిలీ ఖాతాలపై డేటా అందించకపోతే ట్విటర్‌ కొనుగోలు డీల్‌ను విరమించుకుంటానంటూ తాజాగా హెచ్చరించాడు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా ట్విటర్‌కు సోమవారం ఒక లేఖ రాశాడు. విలీన ఒప్పందం ప్రకారం ట్విటర్ వివరాలను వెల్లడించడంలో పారదర్శకంగా వ్యవహరించడంలేదని, దీంతో తామడిగిన డేటాను అడ్డుకుంటోందనే అనుమానం మరింత కలుగుతోందని లేఖలో  మస్క్‌ వ్యాఖ్యానించాడు.

తాము కోరిన డేటాను నిలిపివేయడం సంస్థ తన సమాచార హక్కులను తీవ్రంగా ప్రతిఘటిస్తోందని, అడ్డుకుంటోందని మస్క్‌ భావిస్తున్నారని  మస్క్ లాయర్లు  పేర్కొన్నారు. ఇది కచ్చితంగా నిబంధనల ఉల్లంఘన అని ఈనేపథ్యంలో డీల్‌ రద్దు చేయడంసహా అన్ని హక్కులు తమకున్నాయని పేర్కొన్నారు. కాబోయే యజమానిగా కంపెనీ వ్యాపార  స్వాధీనం, లావాదేవీ ప్రక్రియను సులభతరం చేసుకునేందుకు ట్విటర్‌ యాక్టివ్‌ యూజర్ల బేస్ గురించి పూర్తి, ఖచ్చితమైన అవగాహన ఉండాలని లేఖ స్పష్టం చేసింది. ట్విటర్‌ కొనుగోలు కోసం హెచ్‌ఎస్‌ఆర్ చట్టం కింద నిరీక్షణ వ్యవధి ముగిసిందని ట్విటర్ తెలిపిన దాదాపు వారం తర్వాత టెస్లా సీఈవో ఈ లేఖను రాయడం గమనార్హం.  మరోవైపు ఈ మస్క్‌ లేఖపై ట్విటర్‌ ఇంకా స్పందించలేదు.

కాగా ట్విటర్‌లో నకిలీ ఖాతాలు  మొత్తం యూజర్‌బేస్‌లో 5 శాతం కంటే తక్కువ ఉన్నారో లేదో నిర్ధారించుకునేదాకా 44 బిలియన్‌ డాలర్ల డీల్‌ను  "తాత్కాలికంగా హోల్డ్"లో ఉంచుతున్నట్లు మే 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్విటర్‌ యూజర్లలో 5 శాతం వరకు నకిలీ ఖాతాలున్నాయా? లేదా? అనేది   ధృవీకరించుకునేందుకు స్వతంత్ర విశ్లేషణను కోరింది. కంపెనీ చట్టాలు, టెస్టింగ్ మెథడాలజీలు సరిపోతాయని నమ్మడం లేదు కాబట్టి తాను తప్పనిసరిగా ఉండాలనేది మస్క్‌ డిమాండ్‌. తాజా లేఖ  నేపథ్యంలో ట్రేడింగ్‌లో ట్విటర్ షేర్లు  నష్టాల్లో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు