ఈలాన్‌ మస్క్‌ నాతో చాలా నీచంగా ప్రవర్తించాడు - మహిళా ఉద్యోగి

20 May, 2022 12:58 IST|Sakshi

విచిత్రమైన కామెంట్లు, వివాస్పద చర్యలతో వార్తల్లో నిలిచే ప్రపంచ కుబేరుడు ఈలాన్‌మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మస్క్‌కి చెందిన స్పేస్‌ ఎక్స్‌కి చెందిన ఉద్యోగికి ఈ దారుణమైన అనుభవం ఎదురైనట్టు ఇన్‌సైడర్‌ కథనం ప్రచురించింది.


ప్రయాణం మధ్యలో
ఈలాన్‌ మస్క్‌ 2016లో స్పేస్‌ఎక్స్‌ కార్పొరేట్‌ జెట్‌ విమానంలో ప్రయాణం చేస్తుండగా.. విమానంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి పట్ల ఈలాన్‌ మస్క్‌ అసభ్యంగా ప్రవర్తించాడనేది ఆరోపణల సారాంశం.  ‍ప్రయాణ సమయంలో ఈలాన్‌మస్క్‌ ఉచ్చనీచాలు మరిచి ఆ మహిళకు తన ప్రైవేట్‌ పార్ట్స్‌ చూపించడమే కాకుండా ఆమె శరీర భాగాలను తాకుతూ దారుణంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత తనకు మసాజ్‌ చేయడంతో పాటు తాను చెప్పినట్టు చేస్తే కెరీర్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ తనను ప్రలోభాలకు గురి చేసినట్టు ఆ మహిళ తెలిపింది.  వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ఉద్యోగి చేసిన ఆరోపణలుగా పేర్కొంటూ ఇన్‌సైడర్‌ ఈ కథనం రాసుకొచ్చింది.

భారీ పరిహారం
ఈలాన్‌ మస్క్‌ చేసిన ప్రతిపాదనలపై బాధిత మహిళా ఉద్యోగి తిరస్కరించడమే కాకుండా స్పేస్‌ఎక్స్‌ యజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీనిపై అంతర్గత విచారణ చేపట్టి 2018లో నష్టపరిహారంగా 2.50 లక్షల డాలర్లు చెల్లించారని, దీనిపై మరెక్కడ పెదవి విప్పొద్దంటూ ఆంక్షలు విధించినట్టు  ఆరోపణలు వచ్చాయి.

పొలిటికల్‌ యాంగిల్‌
ఈ ఆరోపణలను ఈలాన్‌మస్క్‌ కొట్టి పారేశాడు. రాజకీయ ప్రేరిత ఆరోపణలు అంటూ తేలిగ్గా తీసుకున్నాడు. ట్విటర్‌ టేకోవర్‌ విషయంలో ఇటీవల ఈలాన్‌ మస్క్‌ అనేక కామెంట్లు చేశాడు. అందులో ఒకటి రిపబ్లిక్‌ పార్టీ, ఆ పార్టికి చెందిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి అనుకూలంగా మాట్లాడాడు. దీంతో డెమెక్రాట్లు తనను టార్గెట్‌ చేస్తూ ఇలాంటి ప్రచారం చేస్తున్నారని, తన ముప్పై ఏళ్ల కెరీర్‌లో ఎన్నడూ రానీ ఆరోపణలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు మస్క్‌. ఎక్కడా జరగని ఘటనను జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని మస్క్‌ అంటున్నాడు. అవన్నీ అసత్యాలే అని కొట్టిపారేశాడు.

చదవండి: Elon Musk On Twitter Fake Accounts: ‘కోకకోలాలో కొకైన్‌’.. అసలేముందక్కడ!.. ప్రజలకు నిజాలు తెలియాలి

మరిన్ని వార్తలు