మాయదారి ట్విటర్‌..మంచులా కరిగిపోతున్న ఎలాన్‌ మస్క్‌ సంపద!

9 Nov, 2022 09:36 IST|Sakshi

44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ కొనుగోలు, ఆ తరువాత సంస్థలో జరుగుతున్న వరుస పరిణామాలతో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంపద మంచులా కరిగిపోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రోజు ఆయన సంపద నికర విలువ (net worth) 200 బిలియన్‌ డాలర్ల దిగువకు పడిపోయింది. 

ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం.. ఎలాన్‌ మస్క్‌ సంపద ప్రస్తుతం 194.8 బిలియన్‌ డాలర్లు ఉండగా... మార్కెట్‌ వ్యాల్యూ 622 బిలియన్‌ డాలర్లుగా ఉన్న టెస్లా సంస్థలో ఆయన వాటా 15 శాతం ఉంది. అయితే ఇప్పుడు టెస్లాలో ఉన్న మస్క్‌ వాటా తగ్గిపోతున్నట్లు యూఎస్‌ సెక్యూరిటీ అండ్‌ ఎక్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) గణాంకాలు చెబుతున్నాయి. 

ట్విటర్‌ కొనుగోలు 
ఎలాన్ మస్క్‌కి ట్విటర్ అంటే ఇష్టం. నిజానికి ఎలాన్ మస్క్, ట్విటర్‌ల మధ్య వ్యవహారం మొదట్లో ఒక మూగ ప్రేమ కథలా ఉండేది. అందుకే ఒకానొక సమయంలో ట్విటర్‌కు ఉన్న అసాధారణ అవకాశాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలన్నది నా అభిష్టం అంటూ వ్యాఖ్యానించారు.  

ఈ ఏడాది జనవరి నుంచి ట్విటర్‌లో కొద్దికొద్దిగా షేర్లు కొనుక్కుంటూ వచ్చిన మస్క్‌ ...ఏప్రిల్‌ నాటికి 3 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 9 శాతం పైగా వాటాలు దక్కించుకున్నారు. అదే నెలలో ట్విట్ట‌ర్‌ని కొనేందుకు బిడ్ వేశాడు. షేరు ఒక్కింటికి 54.20 డాలర్లు ఇచ్చి 44 బిలియన్‌ డాలర్లకు కంపెనీని కొనేస్తానంటూ ఆఫర్‌ ఇచ్చారు. ఆ నిర్ణయంతో  టెస్లా కంపెనీ దాదాపు సగం మార్కెట్ విలువను కోల్పోయింది. అతని నికర విలువ 70 బిలియన్లకు పడిపోయింది.

షేర్ల విక్రయం 
తాజాగా టెస్లాలో 4 బిలియన్‌ డాలర్ల విలువైన స్టాక్‌ను మస్క్‌ విక్రయించారు. మంగళవారం ఎస్‌ఈసీ తన ఫైలింగ్‌లో 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన వారం రోజుల తర్వాత 4 బిలియన్‌ డాలర్ల స్టాక్‌ను అమ్మినట్లు చూపించింది. ట్విటర్ కొనుగోలులో 3.9 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన 19 మిలియన్ షేర్లను అమ్మినట్లు స్పష్టం చేసింది. 

అయితే కొనుగోలు అనంతరం మస్క్‌ ట్విటర్‌పై దృష్టిసారించడం, టెస్లాను పట్టించుకోకపోవడంతో టెస్లాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఆందోళన గురయ్యారు. దీనికి తోడు ఈవీ మార్కెట్‌లో టెస్లాకు పోటీగా ఇతర ఆటోమొబైల్‌ కంపెనీలు ఈవీ కార్లను తయారు చేస్తుండడం వంటి భయాలతో మదుపర్లు టెస్లాలో పెట్టిన పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటున్నారు. వెరసీ మస్క్‌ సంపద మంచులా కరిపోతుంది
 
కాగా ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఎలాన్‌ మస్క్‌ ఉండగా.. రెండో స్థానంలో లగ్జరీ గూడ్స్‌ కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ బెర్నార్డ్ అర్నాల్ట్ ఉన్నారు. ఆర్నాల్డ్‌ కంటే మస్క్‌ సంపద 40 బిలియన్‌ డాలర్లు ఎక్కువ.

చదవండి👉 వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, ‘యాపిల్‌ సంస్థను అమ్మేయండి’!

మరిన్ని వార్తలు