Elon Musk: కష్ట కాలంలో టోంగా దేశానికి అండగా స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్..!

21 Jan, 2022 15:13 IST|Sakshi

కొద్ది రోజుల క్రితం టోంగాకు సమీపంలో ఉన్న సముద్రంలో ఒక భారీ అగ్నిపర్వతం బద్దలవడంతో ఆకాశమంతా ధూళి మేఘాలతో నల్లబారడం, ఆ వెంటనే విరుచుకుపడిన జల ప్రళయం(సునామీ)తో ఈ చిన్న టోంగా దేశం చిగురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రకృతి విలయం సృష్టించిన నష్టం అంచనాలకు చిక్కడం లేదు. ఇంటర్నెట్‌, ఇతర కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్ తెగిపోవడంతో ఆ దేశంతో ఇతర దేశాలు సంప్రదించడానికి కొంచె కష్టం అవుతుంది.

ఈ విపత్తుల వల్ల సముద్రగర్భ కేబుల్ తెగిపోవడంతో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ దేశానికి ఇంటర్నెట్ సేవలు తిరిగి అందించడానికి కనీసం ఒక నెల పాటు సమయం పడుతుందని రాయిటర్స్ ఒక నివేదికలో తెలిపింది. ట్విటర్ వేదికగా పోస్టు చేసిన ఈ నివేదికకు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ఆ దేశ ప్రజలు కోరితే స్టార్ లింకు శాటిలైట్‌ ఇంటర్నెట్ సేవలను అందించడానికి సిద్దంగా ఉన్నట్లు మస్క్ పేర్కొన్నారు. ఉత్తరం న్యూజిలాండ్ పార్లమెంటు సభ్యుడు షేన్ రెటి కూడా టోంగా దేశానికి స్టార్ లింక్ కమ్యూనికేషన్ సేవలను అందించాలని ఎలన్ మస్క్‌కు ట్విటర్ వేదికగా ఒక లేఖ రాశారు. 

ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ అనేది ఎటువంటి కేబుల్ అవసరం లేకుండానే ఉపగ్రహాల ఆధారంగా ఇంటర్నెట్ అందిస్తుంది. ఈ శాటిలైట్‌ ఇంటర్నెట్ వేగం కూడా ఇతర వాటితో పోలిస్తే చాలా వేగంగా ఉంటుంది. ఈ ఏడాది చివరినాటికి మన దేశంలో స్టార్ లింక్ శాటిలైట్‌ ఇంటర్నెట్ సేవలు అందించాలని మస్క్ చూస్తున్నారు. టోంగాకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. టోంగాకు పశ్చిమంగా పసిఫిక్‌ సముద్రంలో తలెత్తిన సునామీ టోంగాను ముంచెత్తింది.

పసిఫిక్‌ అంతటా సునామీ అలలు ఎగసిపడ్డాయి. సునామీ కూడా ఉపశమించినట్లు శాటిలైట్‌ చిత్రాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు అగ్ని పర్వతం నుండి విస్ఫోటనాలు కొనసాగుతుండడంతో అక్కడ వాతావరణ పరిస్థితులు, ఆ ప్రభావంతో చుట్టుపక్కల వాతావరణంలో నెలకొనే ప్రభావాల పట్ల పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న టోంగాకు సాయం చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి.

(చదవండి: సరికొత్త విప్లవం: అమెజాన్‌ బట్టల దుకాణం)

>
మరిన్ని వార్తలు