Elon Musk: ఏకంగా ట్విటర్‌నే దక్కించుకోవాలని ప్లాన్‌, కానీ..

15 Apr, 2022 08:01 IST|Sakshi

కంపెనీ టేకోవర్‌కు 43 బిలియన్‌ డాలర్లు ఆఫర్‌

షేరుకి 54.2 డాలర్లు ఇస్తానని ప్రకటన

ఇప్పటికే ట్విట్టర్‌లో 9.1 శాతం వాటా

న్యూయార్క్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ ఇంక్‌పై ఎలన్‌ మస్క్‌ కన్నేశారు. ఇప్పటికే 9.1 శాతం వాటా కలిగిన మస్క్‌ తాజాగా కంపెనీ టేకోవర్‌కు ఆఫర్‌ ప్రకటించారు. షేరుకి 54.2 డాలర్ల చొప్పున నగదు రూపంలో చెల్లించనున్నట్లు తెలియజేశారు. 100 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వెరసి ట్విటర్‌ కొనుగోలుకి మస్క్‌ 43 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 3.23 లక్షల కోట్లు) విలువైన ఆఫర్‌ను ఇచ్చా రు. ఎలక్ట్రిక్‌ వాహన దిగ్గజం టెస్లా సీఈవో మస్క్‌ ఇటీవలే ట్విటర్‌ బోర్డులో చేరబోనంటూ ప్రకటించిన నేపథ్యంలో టేకోవర్‌ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా నిలిచిన మస్క్‌ మిగిలిన వాటాను సైతం కొనుగోలు చేసేందుకు తాజాగా ప్రతిపాదించినట్లు ట్విటర్‌ ఇంక్‌ నియంత్రణ సంస్థలు(ఎస్‌ఈసీ, ఎక్సే్ఛంజీలు)కు వెల్లడించింది. ఇందుకు వాటాదా రులకు అత్యుత్తమ, తుది ధరను ఆఫర్‌ చేసినట్లు ఈ సందర్భంగా మస్క్‌ సైతం ఎస్‌ఈసీకి తెలియజేశారు. ట్విట్టర్‌లో వాటా వివరాలు వెల్లడించిన ముందు రోజు అంటే ఈ నెల(ఏప్రిల్‌) 1నాటి ధరతో చూస్తే తాజా ఆఫర్‌ 38 శాతం అధికమని, ఇక షేరు కొనుగోళ్లు ప్రారంభించకముందు అంటే జనవరి 28 ముగింపు ధరతో పోలిస్తే 54 శాతం ప్రీమియమని మస్క్‌ ఎస్‌ఈసీకి తెలియజేశారు.

ఫ్రీ స్పీచ్‌కు దన్ను...
ప్రపంచవ్యాప్తంగా భావ ప్రకటనా స్వేచ్చ(ఫ్రీ స్పీచ్‌)కి భారీ అవకాశాలు కల్పించగల సత్తా ట్విటర్‌ ప్లాట్‌ఫామ్‌కున్నట్లు మస్క్‌ అభిప్రాయపడ్డారు. దీంతో ట్విట్టర్‌లో ఇన్వెస్ట్‌ చేసినట్లు నియంత్రణ సంస్థలకు తెలియజేశారు. ప్రజాస్వామ్యం మనగలిగేందుకు సామాజికపరంగా ఫ్రీ స్పీచ్‌ దన్నుగా నిలుస్తుందని పేర్కొన్నారు. అయితే ట్విట్టర్‌లో ఇన్వెస్ట్‌ చేసినప్పటినుంచీ కంపెనీ ఈ సామాజిక ఆవశ్యకతకు ప్రస్తుత విధానంలో మద్దతివ్వలేకపోవడం లేదా కొనసాగించలేకపోవచ్చని తెలుసుకున్నట్లు వివరించారు.

దీంతో ట్విటర్‌ ప్రయివేట్‌ కంపెనీగా మారవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. జనవరి 31 మొదలు ట్విటర్‌ షేర్లను రోజువారీగా కొనుగోలు చేస్తున్నట్లు ఇటీవల నియంత్రణ సంస్థలకు మస్క్‌ వెల్లడించిన విషయం విదితమే. అప్పటికి వ్యాన్‌గార్డ్‌ గ్రూప్‌నకు చెందిన వివిధ మ్యూచువల్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లు మాత్రమే అధిక సంఖ్యలో ట్విటర్‌ షేర్ల ను కలిగి ఉన్నా యి. కాగా, మస్క్‌ ఆఫర్‌పై కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఉద్యోగులతో చర్చిం చనుందని సమాచారం.

14.9 శాతానికే...
సోషల్‌ మీడియా దిగ్గజంలో 9.1 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు మస్క్‌ వెల్లడించాక బోర్డులో సీటును ట్విటర్‌ ఆఫర్‌ చేసింది. అయితే 14.9 శాతానికి మించి వాటాను కొనుగోలు చేసేందుకు వీలులేకుండా షరతులు పెట్టింది. దీంతో మస్క్‌ ఈ డీల్‌ నుంచి వెనక్కి తగ్గారు. ట్విటర్‌ ప్లాట్‌ఫామ్‌లో 8.1 కోట్లమంది ఫాలోవర్స్‌తో మస్క్‌ సుప్రసిద్ధులయ్యారు. పాప్‌ స్టార్స్‌ అరియానా గ్రాండే, లేడీ గాగా తరహాలో ఫాలోవర్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ విభిన్నతరహాగా చేస్తున్న ట్వీట్ల కారణంగా కొన్ని సందర్భాలలో ఎస్‌ఈసీ తదితరాల నుంచి సమస్యలను సైతం మస్క్‌ ఎదుర్కొన్నారు. 2018లో మస్క్‌తోపాటు, ఈవీ కంపెనీ టెస్లా పౌర జరిమానాలకింద 4 కోట్ల డాలర్లు చెల్లించేందుకు అంగీకరించడం గమనార్హం! షేరుకి 420 డాలర్ల ధరలో టెస్లాను ప్రయవేట్‌ చేసేందుకు సొమ్మును కలిగి ఉన్నట్లు మస్క్‌ ట్వీట్‌ చేశారు.

ఇది జరగనప్పటికీ టెస్లా షేరు విలువ జోరందుకుంది. వెరసి మస్క్‌ చిక్కుల్లోపడగా.. ఇటీవల ట్విటర్‌ షేర్ల కొనుగోలు వివరాలను ఆలస్యంగా వెల్లడించడంతో ఎస్‌ఈసీ ఆగ్రహానికి సైతం గురయ్యారు. ఫ్రీ స్పీచ్‌కు బలమైన మద్దతుదారుగా మస్క్‌ తనను తాను అభివర్ణించుకుంటారు. అంతేకాకుండా ఫ్రీ స్పీచ్‌ మనుగడ విషయంలో ట్విటర్‌ ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టడంలేదని విమర్శించారు. గతంలో యూఎస్‌ మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం ఇదే విధమైన అభిప్రాయాలు వెల్లడించగా.. ట్విటర్‌ కంటెంట్‌  నిబంధనల ఉల్లంఘనలతో ఇతర మితవాద రాజకీయ నేతల అకౌంట్లు సైతం నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. కాగా.. మస్క్‌ వాటాసహా ట్విటర్‌ ఆఫర్‌ 43 బిలియన్‌ డాలర్లుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

షేరు జోరు...
మస్క్‌ చేసిన తాజా ప్రతిపాదన కారణంగా ట్విటర్‌ షేరుకి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. దీంతో బుధవారం ముగింపు ధర 45.85 డాలర్లతో పోలిస్తే గురువారం 48.37 డాలర్ల వద్ద ప్రారంభమైంది. తదుపరి 3.2 శాతం లాభంతో 47.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బుధవారం ముగింపుతో పోలిస్తే మస్క్‌ ఆఫర్‌ ధర 18% పైగా ప్రీమియంకావడం గమనార్హం! కాగా.. మస్క్‌ ఈవీ కంపెనీ టెస్లా ఇంక్‌ షేరు 3.3 శాతం పతనమై 989 డాలర్ల వద్ద కదులుతోంది.

చదవండి: ఎలన్‌ మస్క్‌ మాయ.. అడుగుపెట్టాడో లేదో ట్విటర్‌పై కాసులవర్షం..! 

మరిన్ని వార్తలు