Elon Musk: టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల అభిమానులకు ఎలాన్‌ మస్క్‌ శుభవార్త!

29 Aug, 2022 21:26 IST|Sakshi

టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల అభిమానులకు ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ శుభవార్త చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి టెస్లా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఎలక్ట్రిక్‌ కార్లను భారీ ఎత్తున విడుదల చేసేలా ప్లాన్‌ చేసినట్లు వెల్లడించారు. 

2014 నుంచి ఎలాన్‌ మస్క్‌ టెస్లా సెల్ఫ్‌ డ్రైవ్‌ ఎలక్ట్రిక్‌ కార్లపై పనిచేస్తున్నారు. నాటి నుంచి ఆ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లలో లోపాలు తలెత్తడం, టెస్ట్‌ డ్రైవ్‌ సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. అందుకే ఈ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేసేలా అనుమతి ఇచ్చేందుకు ఆయా దేశాలు నిరాకరిస్తూ వస్తున్నాయి.  

అయితే  ఈ తరుణంలో యూరప్‌ దేశమైన నార్వేలో జరిగిన ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో మస్క్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన దృష్టిని స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్, సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై కేంద్రీకరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సెల్ఫ్ డ్రైవ్‌ కార్లను ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయాలని భావిస్తున్నా. ఆమోదాన్ని బట్టి అమెరికా, ఐరోపాలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నాం అని అన్నారు.  

చమురు, గ్యాస్ అవసరం
ఈ ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో అంతకుముందు, మస్క్ మాట్లాడుతూ..ప్రపంచ నాగరికత కొనసాగాలంటే చమురు, గ్యాస్ వెలికితీతను కొనసాగించాలన్నారు. అదే సమయంలో స్థిరమైన శక్తి వనరులను కూడా అభివృద్ధి చేయాలని అన్నారు. వాస్తవానికి మనం చమురు, గ్యాస్‌ను స్వల్పకాలంలో ఉపయోగించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. లేకపోతే నాగరికత (Civilization )కూలిపోతుంది అని మస్క్ స్పష్టం చేశారు. 

చమురు, గ్యాస్ కోసం నార్వే ఆయిల్‌ డ్రిల్ ప్రాసెస్‌ చేయాలా అని అడిగినప్పుడు, మస్క్ ఇలా అన్నాడు: "ఈ సమయంలో కొంత అదనపు అన్వేషణ అవసరమని నేను భావిస్తున్నాను."కాగా, ఇంధన సంక్షోభంతో యూరోప్​ కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఎలాన్​ మస్క్​ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

>
మరిన్ని వార్తలు