డబ్బులు వృధా చేసుకోకండి.. యాపిల్‌పై ఎలన్‌ మస్క్‌ సెటైర్లు

1 Dec, 2021 11:38 IST|Sakshi

అమెరికా కంపెనీలన్నా.. వాటి ఉత్పత్తులన్నా టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌కి ఎనలేని మంట. ఛాన్స్‌ దొరికినప్పుడల్లా వాటి మీద తన శైలిలో సెటైర్లు వేస్తుంటాడు కూడా. ఈ తరుణంలో టెక్‌ దిగ్గజ కంపెనీ ‘యాపిల్‌’ మీద తాజాగా ట్విటర్‌లో వెటకారం ప్రదర్శించాడు.

టెస్లా కంపెనీ తెచ్చిన ‘సైబర్‌విజిల్‌’ను ఎలన్‌ మస్క్‌ తాజాగా ప్రమోట్‌ చేయడం మొదలుపెట్టాడు. 50 డాలర్ల (రూ.3,747) విలువ చేసే ఈ విజిల్‌ను కొనుగోలు చేసి ‘విజిల్‌ వేయండి’ అంటూ ట్విటర్‌లో సరదాగా ఓ పోస్ట్‌ పెట్టాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నా.. తన తర్వాతి పోస్టులో ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్‌ను ఉద్దేశిస్తూ ఓ విజ్ఞప్తి చేశాడు మస్క్‌. 

యాపిల్‌ కంపెనీ అక్టోబర్‌ నెలలో 19 డాలర్లతో ఓ క్లాత్‌ను తీసుకొచ్చింది. ఈ క్లాత్‌ను సిల్లీగా కొనేసి డబ్బులు వృధా చేసుకోవద్దంటూ జనాలకు సూచనలు కూడా చేశాడు మస్క్‌. ఇక టెస్లా తీసుకొచ్చిన సైబర్‌ విజిల్‌ అచ్చం టెస్లా తీసుకురాబోయే ‘సైబర్‌ట్రక్‌’ ఆకారాన్ని పోలి ఉంది. ఇది సీరియస్‌ ప్రొడక్టేనా? లేదంటే యాపిల్‌కు కౌంటరా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక యాపిల్‌ తన గ్యాడ్జెట్స్‌ను క్లీన్ చేసుకోవడానికి వీలుగా యాపిల్‌ క్లాత్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 

ఏ విషయాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చేసుకుని ప్రమోట్‌ చేసుకునే ఎలన్‌ మస్క్‌.. యాపిల్‌ క్లాత్‌ విషయంలో గతంలోనూ ఇలాగే స్పందించాడు. యాపిల్‌ కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ ఇస్తాంబుల్‌లో కొత్త స్టోర్‌ గురించి ఓ ట్వీట్‌ చేయగా.. ఆ స్టోర్‌ను యాపిల్‌ క్లాత్‌ కోసమే సందర్శించాలంటూ వెటకారం ప్రదర్శించాడు ఎలన్‌ మస్క్‌.


క్లిక్‌ చేయండి: ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌పై క్రిమినల్‌ కేసు పెట్టండి

ఇది చదవండి: యాపిల్‌ సీఈవోగా మస్క్‌!!.. బూతులు తిట్టేసిన టిమ్‌ కుక్‌

మరిన్ని వార్తలు