లక్షకోట్లకు పైగా నష్టం, రాజకీయాల్లోని ఆ వృద్దులపై నిషేదం విధించాలి..! ఎలన్‌ పిలుపు

5 Dec, 2021 10:38 IST|Sakshi

స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ మరోసారి తన నోటికి పనిచెప్పారు. 70 ఏళ్ల వయస్సు పైబడిన వారిని రాజకీయ పదవులకు పోటీ చేయకుండా నిషేధించాలని పిలుపునిచ్చారు. ట్వీట్‌లో చట్టసభ సభ్యులు ఎవరనేది ప్రస్తావించనప్పటికీ, ప్రస్తుత అధ్యక్షుడు  జో బిడెన్‌, మాజీ అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇద్దరూ 70 ఏళ్లు పైబడిన వారు. కొద్ది రోజుల క్రితం ఎలన్‌ సెటైర్లు వేసిన సెనేటర్‌ సాండర్స్‌ వయస్సు 80 సంవత్సరాలు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎలన్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

ఎలన్‌ మస్క్‌ అమెరికా నేతల్ని పరోక్షంగా కర్ర కాల్చి వాత పెడుతున్నారు. నవంబర్‌ 13న వాషింగ్టన్‌లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్, జెఫ్‌ బేజోస్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌ లాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్‌ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. అదే సమయంలో అమెరికా సెనేట్ బడ్జెట్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సాండర్స్ అమెరికాలోని 0.1 శాతం ఉన్న అత్యంత ధనవంతులు కుటుంబాలపై వార్షిక పన్నును ప్రతిపాదించారు.

‘‘అత్యంత ధనవంతులు వారి వంతు పన్నులను సక్రమంగా చెల్లించాల్సిందిగా మనం డిమాండ్‌ చేయాలి’’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌పై ఎలన్‌ తనదైన స్టైల్లో సాండర్స్‌ పై సెటైర్లు వేశారు. ‘‘ సాండర్స్‌ నువ్వు బతికున్నావనే విషయాన్ని నేను మర్చిపోతుంటాను..ఇప్పుడేమంటావ్‌.. నేను మరింత స్టాక్‌ అమ్ముకోవాలని నువ్వు కోరుకుంటున్నావా.. చెప్పు’’ అంటూ ఎలన్‌ మస్క్‌ విరుచుకుపడ్డాడు. 

అయితే తాజాగా ఎలన్‌ చేసిన 'ఎలిమినేట్‌' వ్యాఖ్యలకు కారణం సెనెటర్లు బిలియనీన్లు పన్నులు కట్టాలని సెనెటర్లు చేసిన డిమాండ్లేనని తెలుస్తోంది. బిలియనీన్లు పన్నులు చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో ఎలన్‌..టెస్లాలోని తన శాతం షేర్లను అమ్మకానికి పెడుతున్నట్లు ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ దెబ్బకు టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి.

దీంతో లక్షకోట్లుకు పైగా నష్టం వాటిల‍్లింది. ఆ నష్టాన్ని తట్టుకోలేకనే ఈ బిలియనీర్‌  70ఏళ్లకు పై బడిన వారిని రాజకీయాల్లో పదవులకు పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తించాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ఎలన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యం అమెరికాలో చర్చాంశనీయం కాగా..ఆ వ్యాఖ్యల ప్రభావం ఎలన్‌పై భారీగా ఉండొచ్చనేది విశ్లేషకులు చెబుతున్నమాట. 

చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1

మరిన్ని వార్తలు