ట్విటర్‌ డీల్‌కు మస్క్‌ బ్రేకులు

14 May, 2022 01:12 IST|Sakshi

నకిలీ ఖాతాల సంఖ్యపై సందేహాలు

ఒప్పందాన్ని తాత్కాలికంగా 

పక్కన పెడుతున్నట్లు వెల్లడి

లండన్‌: మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసే అంశం కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ట్విటర్‌ చూపుతున్న స్పామ్, నకిలీ ఖాతాల సంఖ్యపై మస్క్‌ సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డీల్‌ను తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రోజువారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్యలో స్పామ్, నకిలీ ఖాతాలు అయిదు శాతం కన్నా తక్కువే ఉంటాయంటూ మార్చి త్రైమాసిక ఫలితాల్లో ట్విటర్‌ వెల్లడించిన వార్తను తన ట్వీట్‌కు ఆయన జత చేశారు.

‘మొత్తం యూజర్లలో నకిలీ ఖాతాల సంఖ్య నిజంగానే అయిదు శాతం కన్నా తక్కువే ఉందని «ధ్రువీకరించే వివరాలు అందేవరకూ ట్విటర్‌ డీల్‌ను తాత్కాలికంగా ఆపుతున్నాం‘ అని మస్క్‌ వెల్లడించారు. అయితే, ఈ ఒక్క అంశం వల్ల ట్విటర్‌ టేకోవర్‌ ఒప్పందానికి విఘాతమేదైనా కలుగుతుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అటు ట్విటర్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇద్దరు టాప్‌ మేనేజర్లను తొలగించిన ట్విటర్‌.. కీలక స్థానాలకు మినహా ఇతరత్రా నియామకాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని పేర్కొంది.

డీల్‌ నుంచి బైయటపడేందుకు సాకు..
డీల్‌ నుంచి బైటపడటానికి మస్క్‌.. నకిలీ ఖాతాల సాకును చూపుతున్నట్లుగా అనిపిస్తోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. తద్వారా టేకోవర్‌ కోసం 44 బిలియన్‌ డాలర్లు వెచ్చించే బదులు పరిహారం కింద గరిష్టంగా 1 బిలియన్‌ డాలర్లు కట్టి మస్క్‌ తప్పించుకునే యోచనలో ఉండొచ్చని పేర్కొన్నాయి. ఇన్వెస్టర్ల అభిమతానికి విరుద్ధంగా ట్విటర్‌పై దృష్టి పెట్టడం వల్ల టెస్లా వ్యాపారం గాడి తప్పే అవకాశం ఉండటం కూడా ఇందుకు కారణం కావచ్చని వివరించాయి. మరోవైపు, కంపెనీ షేరు కుదేలయ్యే రకంగా చేసి, మరింత చవకగా దక్కించుకోవాలని మస్క్‌ భావిస్తుండవచ్చని మరికొందరు పరిశీలకులు అభిప్రాయపడ్డారు.  

ట్విటర్‌ షేరు కుదేల్‌..
టేకోవర్‌ డీల్‌కు బ్రేకులు పడ్డాయన్న వార్తలతో ట్విటర్‌ షేరు శుక్రవారం ఒక దశలో ఏకంగా 10 శాతం పైగా పతనమై 40.01 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అటు టెస్లా ఆరు శాతం పైగా ఎగిసి 775 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. షేరు ఒక్కింటికి 54.20 డాలర్లు ఇస్తానంటూ మస్క్‌ ఆఫర్‌ ఇచ్చిన రోజున ట్విటర్‌ షేరు సుమారు 45 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. ఆ తర్వాత డీల్‌ వార్తలతో 50 డాలర్ల పైకి ఎగిసింది. కానీ తాజా పరిస్థితులతో 40 డాలర్ల స్థాయికి పడిపోయింది. 

మరిన్ని వార్తలు