రికార్డ్‌ల రారాజు.. ఎలాన్‌ మస్క్‌ ఖాతాలో ప్రపంచంలో అత్యంత అరుదైన చెత్త రికార్డ్‌

10 Jan, 2023 17:46 IST|Sakshi

ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఎలాన్‌ మస్క్‌ సరికొత్త చెత్త రికార్డ్‌లను క్రియేట్‌ చేశారు. సుదీర్ఘ కాలంగా వ్యక్తిగత సంపదను కోల్పోయిన వారిలో ఒకరిగా నిలిచి గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. 

ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం..2000 సంవత్సరం తర్వాత ప్రపంచ చరిత్రలో రెండో సారి అత్యధిక సంపదను కోల్పోయిన వారిలో మస్క్‌ ఒకరు. నవంబర్‌ 2021 నుంచి 182 బిలియన్‌ డాలర్ల సంపద కరిగింది. మరికొన్ని నివేదికలు ఆ మొత్తం 200 బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు హైలెట్‌ చేస్తున్నాయి. 

అయితే మస్క్‌ ఎంత మొత్తం వెల్త్‌ నష్టపోయారనేది నిర్ధారించడం కష్టంగా ఉన్నా..గత రికార్డులను తిరగరాశారు. 2000 సంవత్సరంలో జపాన్‌ టెక్‌ ఇన్వెస్టర్‌ మసయోషి సన్‌ 58.6 బిలియన్ల నష్టాన్ని చవిచూశారు. ఇప్పుడు మస్క్‌ ఏకంగా 182 బిలియన్‌ డాలర్లను లాస్‌ అయ్యారని గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌ తెలిపింది. ది హిల్‌ నివేదిక ప్రకారం.. ఎలాన్‌ మస్క్‌ నెట్‌ వర్త్‌ నవంబర్‌ 2021 నుంచి జనవరి 2023 వరకు 320 బిలియన్‌ డాలర్లు కరిగిపోయింది. ప్రస్తుతం ఆయన సంపద 137 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దీనంతటికి కారణం టెస్లా షేర్లు నిరాశపరచడమేనని తెలుస్తోంది. 

ట్విటర్‌ ముంచింది? 
మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు 7 బిలియన్‌ డాలర్ల విలువైన  టెస్లా షేర్లను భారీ ఎత్తున అమ్మేశారు. నవంబర్‌ నెలలో 4 బిలియన్‌ డాలర్లు,డిసెంబర్‌ నెలలో మరో 3.58 బిలియన్ల విలువైన స్టాక్‌ను విక్రయించాడు. అలా గతేడాది ఏప్రిల్ నుండి 23 బిలియన్ల విలువైన టెస్లా స్టాక్స్‌ను సేల్‌ చేశారు. దీంతో పాటు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని కోల్పోయారు. ఫ్రాన్స్‌ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్  190 బిలియన్ల నికర విలువతో ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు.  

పునాదులు కదిలాయా?
ట్విటర్‌ కొనుగోలుతో మస్క్ వ్యాపార సామ్రాజ్యపు పునాదులు కదిలిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2022 అక్టోబర్‌ నెలలో 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్‌ వ్యాపార రంగంలో ప్రాభవం తగ్గుతూ వస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మస్క్‌ను తక్కువ అంచనా వేయొద్దు 
ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. మసయోషి సన్ నికర విలువ  ఫిబ్రవరి 2000లో గరిష్టంగా  78 బిలియన్ల నుండి అదే సంవత్సరం జూలైలో 19.4 బిలియన్లకు క్షీణించిందని, అతని కంపెనీ సాఫ్ట్‌బ్యాంక్ విలువ డాట్ కామ్‌ క్రాష్‌ అవ్వడంతో తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు. కానీ ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ పునర్వైభవం కోసం ప‍్రయత్నిస్తున్నారని, భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో బౌన్స్ బ్యాక్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని, ఎందుకంటే అక్కడ ఉంది ఎలాన్‌ మస్క్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్ని వార్తలు