సీఈవో పదవులకు గుడ్‌బై.. కొత్త అవతారం! తాజా ట్వీట్‌తో కలకలం

10 Dec, 2021 13:44 IST|Sakshi

Elon Musk About Quitting Job Tweet: ఎలన్‌ మస్క్‌.. ప్రపంచంలోనే అత్యధిక ధనికుడు. వ్యాపారంతో పాటు తన క్రేజీ చేష్టలతో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పరుచుకున్న టెక్‌ మేధావి. టెస్లా సీఈవోగా, స్పేస్‌ఎక్స్‌ అధినేతగా.. నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడీయన. అలాంటి వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకున్నాడా? కొత్త అవతారం ఎత్తబోతున్నాడా? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది ఇప్పుడు.
 

ఎలన్‌ మస్క్‌ ఏం చేసినా అదో హాట్‌ టాపికే!. అలాంటిది తాజాగా ఆయన ట్వీట్‌ ఒకటి ఆయన అభిమానులను ఓవైపు సరదాగా, మరోవైపు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాను చేస్తున్న పనులన్నింటిని వదిలేసి.. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిపోవాలనుకుంటున్నట్లు ట్వీటేశాడు. అంతేకాదు దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడిగాడు కూడా. దీంతో కార్పొరేట్‌ రంగంలో కలకలం రేగింది.  

నమ్మొచ్చా?
ఎలన్‌ మస్క్‌ నిజంగానే తాను నిర్వహిస్తున్న బాధ్యతల నుంచి తప్పుకుంటాడా? అలాగని జోక్‌ చేశాడని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మస్క్‌ చెప్పిందే చేసిన దాఖలాలు ఎక్కువ కాబట్టి. పైగా ట్విటర్‌ వేదికగా గతంలో ఆయన చెప్పినవెన్నో చేశాడు కూడా. అంతెందుకు ఈమధ్యే టెస్లాలోని తన 10 శాతం వాటాను సైతం అమ్మేద్దామనుకుంటున్నానని ఫాలోవర్స్‌ అభిప్రాయం కోరినప్పుడు.. అంతా నవ్వుకున్నారు. కానీ, టెస్లా బోర్డు సభ్యులతో సహా అందరికీ షాకిస్తూ.. వాటాను అమ్మేస్తూ వెళ్తున్నాడు. ఇప్పటికే 12 బిలియన్‌ డాలర్ల షేర్లను అమ్మేశాడు కూడా.  ఈ తరుణంలో మస్క్‌ తాజా ట్వీట్‌ కార్పొరేట్‌ రంగంలో హాట్‌ టాపిక్‌గా మారింది. మస్క్‌ నిర్ణయం ఎలాంటిదైనా..  ఈ ట్వీట్‌ ప్రభావం స్టాక్‌ మార్కెట్‌పైనా పడే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

టెస్లా సీఈవోగానే కాకుండా సొంత రాకెట్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కూ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు యాభై ఏళ్ల ఎలన్‌ మస్క్‌. టెస్లా నుంచి పైసా కూడా జీతంగా తీసుకోకుండా.. తన వాటా ద్వారా లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇక స్పేస్‌ఎక్స్‌ ఒప్పందాలు-షేర్లతోనూ బిలియన్లు సంపాదిస్తున్నాడు.  వీటితో పాటు ది బోరింగ్‌ కంపెనీ అనే మౌలిక వసతుల కంపెనీ, బ్రెయిన్‌ చిప్‌ స్టార్టప్‌ ‘న్యూరాలింక్‌’లకు వ్యవస్థాపకుడి హోదాలో పని చేస్తున్నాడు. 

కొసమెరుపు.. ఈ ఏడాది జనవరిలో ఓ సదస్సులో ఎలన్‌ మస్క్‌ మాట్లాడుతూ.. టెస్లా సీఈవోగా తానే మరికొన్నేళ్లపాటు కొనసాగుతానని చెప్పడం. ఇక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారతాను అని మస్క్‌ స్టేట్‌మెంట్‌కి ఎలాంటి కామెంట్లు వస్తున్నాయో మీరే చూడండి. 


చదవండి: భారత్‌లో ఎలన్‌ మస్క్‌ డామినేషన్‌!

మరిన్ని వార్తలు