చరిత్ర సృష్టించనున్న ఎలన్‌ మస్క్‌..!

27 Jun, 2021 20:44 IST|Sakshi
ఫైల్‌ ఫోటో: స్టార్‌షిప్‌ (ఫోటో కర్టసీ: స్పేస్‌ఎక్స్‌)

టెక్సాస్‌: ఎలన్‌ మస్క్‌ ది రియల్‌ లైఫ్‌ ఐరన్‌ మ్యాన్‌.. అంగారక గ్రహం, చంద్రుడిపైకి మానవులను తీసుకెళ్లాలని ఎంతగానో తహతహలాడుతున్నాడు. అందుకోసం ఇప్పటికే మానవులను ఇతరగ్రహలపైకి రవాణాచేసే అంతరిక్షనౌక స్టార్‌షిప్‌ ప్రయోగాలను స్పేస్‌ఎక్స్‌ కంపెనీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అనేక పరాజయాల తరువాత అంతరిక్షనౌక స్టార్‌షిప్‌.. నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిసి గాల్లో చక్కర్లు కొడుతూ హై ఆల్టిట్యూడ్‌ టెస్ట్‌ను విజయవంతంగా స్పేస్‌ఎక్స్‌ సంస్థ పరీక్షించింది.

ఎలన్‌ మస్క్‌ కలల ప్రాజెక్ట్‌ స్టార్‌షిప్‌ మరో కొత్త చరిత్రను సృష్టించనుంది. స్టార్‌షిప్‌ను తొలిసారిగా భూ నిర్ణీత కక్ష్యలోకి పంపాలని ప్రణాళిక చేస్తోంది. స్టార్‌షిప్‌ ఆర్బిటల్‌ ప్రయోగాన్ని జూలైలో లాంచ్‌ చేయనున్నట్లు స్పేస్‌ఎక్స్‌ అధ్యక్షురాలు గ్విన్నే షాట్‌వెల్‌ పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన నేషనల్ స్పేస్ సొసైటీ అఫ్‌ ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సదస్సులో షాట్వెల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం స్టార్‌షిప్‌తో చేసే ఆర్బిటల్‌ ప్రయోగం చరిత్ర సృష్టించబోతుందని పేర్కొన్నారు. ఈ ప్రయోగం కష్టంతో కూడుకున్న పనైనా.. స్పేస్‌ ఎక్స్‌ శాస్త్రవేత్తలు ఆర్బిటల్‌ లాంచ్‌ ప్రయోగాన్ని విజయవంతం చేస్తామనే కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపింది.

స్టార్‌షిప్‌ ఆర్బిటల్‌ లాంచ్‌ ప్రయోగం 90 నిమిషాలపాటు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ ప్రయోగానికి ఫెడరల్‌ ఏవియేషన్‌ అఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ఆమోదం రాలేదు. అంతేకాకుండా స్టార్‌షిప్‌ ఆర్బిటల్‌ లాంచ్‌ ప్రయోగానికి పర్యావరణ అనుమతులు కూడా రావాల్సి ఉంది. ఈ ప్రయోగానికి అనుమతులు తొందరలోనే వస్తాయని స్పేస్‌ఎక్స్‌ సంస్థ అధ్యక్షురాలు గ్విన్నే షాట్‌వెల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్‌షిప్‌ ప్రయోగం విజయవంతమైతే ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.

చదవండి: స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌.. సింపుల్‌గా పరిష్కరించిన యువకుడు..!

>
మరిన్ని వార్తలు