ఎలన్‌ మస్క్‌కు అన్నీ ఆటంకాలే! భారత్‌లో లైసెన్స్‌ కోసం ఇంకెన్నాళ్లు ఆగాలో?

3 Feb, 2022 16:02 IST|Sakshi

ప్రపంచం మొత్తం తన వ్యాపార రంగాన్ని విస్తరించాలన్న ఎలన్‌ మస్క్‌ ప్రయత్నాల​ను భారత్‌ ముందుకు పోనివ్వడం లేదు. అత్యధిక జనాభా ఉన్న చైనాలో ఇదివరకే టెస్లా కార్యకలాపాలు కొనసాగిస్తుండగా.. భారత్‌లో మాత్రం దిగుమతి సుంకం దెబ్బకి జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ తరుణంలో మరో వ్యాపారానికి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతోంది. 

ఎలన్‌ మస్క్‌ సొంత కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ నుంచి శాటిలైట్‌ సంబంధిత ‘స్టార్‌లింక్‌’ ఇంటర్నెట్‌ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరప్‌, సౌత్‌-నార్త్‌ అమెరికాలోని కొన్ని దేశాలతో పాటు ఓషియానా(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌)లలో సేవలు అందుతున్నాయి . ఇక ఆసియాలో అడుగుపెట్టడానికి భారత్‌ బెస్ట్‌ కంట్రీగా భావించి.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

సేవల కంటే ముందు బుక్సింగ్‌ సైతం ప్రారంభించించింది కూడా. అయితే లైసెన్స్‌ లేకుండా కార్యకలాపాలు మొదలుపెట్టాలన్న ప్రయత్నాలకు కేంద్రం అడ్డు పడింది. దీంతో స్టార్‌లింక్‌ ప్రయత్నాలు సైతం నిలిచిపోగా.. కనెక్షన్‌ల కోసం తీసుకున్న డబ్బులు సైతం వెనక్కి ఇచ్చేసింది స్టార్‌లింక్‌. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.. భారత ప్రభుత్వ ఒత్తిడితో స్టార్‌లింక్‌ ఇండియా డైరెక్టర్‌ పదవికి సంజయ్‌ భార్గవ రాజీనామా చేశారు కూడా. ఇదిలా ఉండగా.. 

తాజాగా అతిపెద్ద దేశాల్లో టాప్‌ టెన్‌లో ఉన్న బ్రెజిల్‌.. స్టార్‌లింక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వాస్తవానికి బ్రెజిల్‌ నేషనల్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఏజెన్సీ (Anatel)తో స్టార్‌లింక్‌ సంప్రదింపులు జరిపిందే లేదు. అయినప్పటికీ బ్రెజిల్‌ గవర్నమెంట్‌ ముందుకొచ్చి.. డీల్‌ ఓకే చేసుకోవడం గమనార్హం. మరోవైపు భారత్‌లో లైసెన్స్‌ ప్రయత్నాలు మొదలుపెట్టిన స్టార్‌లింక్‌.. కొత్త చీఫ్‌ కోసం వేట సైతం ప్రారంభించింది. అయితే లైసెన్స్‌ పరిశీలనలోనూ జాప్యం జరుగుతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది  స్టార్‌లింక్‌.

చదవండి: అయ్యా ఎలన్‌ మస్క్‌.. మన దగ్గర బేరాల్లేవమ్మా!

మరిన్ని వార్తలు