Elon Musk Buys Twitter: ట్విట‌ర్‌ను కైవ‌సం చేసుకున్న ఎల‌న్ మ‌స్క్!

26 Apr, 2022 07:33 IST|Sakshi

స్పేస్ ఎక్స్ అధినేత ఎల‌న్ మ‌స్క్ అనుకున్న‌ది సాధించారు. ప్రముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట‌ర్‌ను కొనుగోలు చేశారు.  ఫ్రీ స్పీచ్ (వాక్ స్వాతంత్య్రానికి) కోసం ట్విట‌ర్‌ను కొనుగోలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్ర‌క‌టించారు. అలా తన వ్యూహాలలో భాగంగా సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ట్విట‌ర్‌ను సొంతం చేసుకున్నాడు. 

మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌పై కన్నేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మొత్తానికి ఆ సంస్థను సొంతం చేసుకున్నారు. ట్విటర్‌ బోర్డ్‌ ఈ ఒప్పందానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. టేకోవర్‌ విలువ దాదాపు 44 బిలియన్‌ డాలర్లు.  షేరు కొనుగోలు ధర 54.20 డాలర్లు. టేకోవర్‌ కోసం 46.5 బిలియన్‌ డాలర్ల నిధులు కూడా సిద్ధం చేసుకున్నానంటూ మస్క్‌ ప్రకటించడంతో ట్విటర్‌ యాజమాన్యంపై తొలుత ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో సోమవారం మస్క్‌తో చర్చలు జరిపింది.  అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా వ్యవస్థాపకుడైన మస్క్‌ సంపద విలువ ప్రస్తుతం 279 బిలియన్‌ డాలర్ల పైమాటే. టెస్లాలో అయనకు 17 శాతం వాటాలు ఉన్నాయి.

 

హైడ్రామా.. 
వాక్‌ స్వాతంత్య్రం, స్వేచ్ఛగా అభిప్రాయాల వ్యక్తీకరణ కోసం వేదికగా ఏర్పాటైన ట్విటర్‌ ప్రస్తుతం ఆ లక్ష్యాలకు విరుద్ధంగా పనిచేస్తోందంటూ మస్క్‌ కొన్నాళ్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ట్విటర్‌లో వాటాదారుగా మారితే సంస్థను చక్కదిద్దవచ్చన్న ఉద్దేశంతో ఇటీవలే 9.2 శాతం వాటాలను 2.9 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. తద్వారా డైరెక్టరుగా నియమితులయ్యే అవకాశం దక్కించుకున్నారు. కానీ ఆ హోదా తీసుకుంటే వాటాలను నిర్దిష్ట శాతానికి మించి పెంచుకోవడానికి లేకపోవడంతో డైరెక్టరు హోదాను తిరస్కరించారు. ఆ తర్వాత ఏకంగా కంపెనీ మొత్తాన్నే కొనేస్తానంటూ ప్రకటించారు. ఇందుకోసం షేరు ఒక్కింటికి 54.20 డాలర్ల చొప్పున మొత్తం 43 బిలియన్‌ డాలర్లు చెల్లించి,  టేకోవర్‌ చేసేలా ఆఫర్‌ ఇచ్చారు. అయితే, దీన్ని అడ్డుకునేందుకు ట్విటర్‌ యాజమాన్యం ప్రయత్నించింది. టేకోవర్‌ చేయడం అసాధ్యమయ్యే స్థాయిలో ఖరీదైన వ్యవహారంగా మార్చేసేలా పాయిజన్‌ పిల్‌ అనే వ్యూహాన్ని ప్రయోగించింది. కానీ తాను ఇప్పటికే నిధులు కూడా సిద్ధం చేసుకున్నానంటూ, టేకోవర్‌ను కాదనలేని విధంగా మస్క్‌ గత వారం ప్రకటించారు. టెస్లాలో తనకున్న వాటాలను తనఖా పెట్టడం ద్వారా మోర్గాన్‌ స్టాన్లీ, ఇతర బ్యాంకుల నుంచి నిధులు సమకూర్చుకుంటున్నట్లు అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థకు మస్క్‌ తెలియజేశారు. దీంతో మస్క్‌తో టేకోవర్‌పై చర్చించడం ట్విటర్‌ యాజమాన్యానికి అనివార్యంగా మారింది.

 

మస్క్‌ ఇప్పుడు ఏం చేయొచ్చు.. 
ట్విటర్‌ను సంస్కరించేందుకు ఆయన గతంలో పలు ప్రతిపాదనలు చేశారు. టేకోవర్‌ చేశాక వాటిని అమలు చేయొచ్చని యూజర్లు భావిస్తున్నారు. కంటెంట్‌పరంగా నియంత్రణలను సడలించడం (అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వంటి వారి ఖాతాలను రద్దు చేయడానికి దారి తీసిన నిబంధనలు మొదలైనవి), నకిలీ .. ఆటోమేటెడ్‌ ఖాతాలను తొలగించడం, ఎడిట్‌ బటన్‌ ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి.

 

ట్విటర్‌ కథ ఇదీ.. 
అమెరికాకు చెందిన మైక్రోబ్లాగింగ్, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సర్వీస్‌ ట్విటర్‌ను జాక్‌ డోర్సీ, బిజ్‌ స్టోన్, ఎవాన్‌ విలియమ్స్, నోవా గ్లాస్‌ కలిసి 2006లో ఏర్పాటు చేశారు. కొన్ని పదాల్లో క్లుప్తంగా అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగపడేలా దీన్ని ఉద్దేశించారు. ప్రస్తుతం దీనికి ప్రవాస భారతీయుడైన పరాగ్‌ అగర్వాల్‌ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఫేస్‌బుక్, టిక్‌టాక్‌ వంటి పోటీ సంస్థలతో పోలిస్తే ట్విటర్‌ యూజర్ల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ సెలబ్రిటీలు, ప్రపంచ నేతలు, జర్నలిస్టులు, మేధావులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్వయంగా మస్క్‌కు 8.1 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. గతేడాది రెండో త్రైమాసికం గణాంకాల ప్రకారం ట్విటర్‌కు 20 కోట్ల పైగా యూజర్లు ఉన్నారు. అమెరికాలో అత్యధికంగా 7.7 కోట్ల పైచిలుకు ఉండగా.. భారత్‌లో వీరి సంఖ్య 2.36 కోట్ల స్థాయిలో ఉంది.  

షేరు రయ్‌..: కొనుగోలు వార్తలతో ట్విటర్‌ షేరు సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 5.5  శాతం లాభంతో 51.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  

ట్విట‌ర్ కో సీఈఓ బ్రెట్ టేలర్ స్పంద‌న‌
ఎల‌న్ మ‌స్క్ ట్విట‌ర్‌ను 44బిలియన్‌ డాల‌ర్ల‌ను కొనుగోలు చేసిన‌ట్లు నివేదిక‌లు వెలుగులోకి రావ‌డంపై ట్విట‌ర్ కో సీఈఓ బ్రెట్ టేలర్ స్పందించారు. ఎల‌న్ మ‌స్క్ ట్విట‌ర్‌ను కొనుగోలు చేయ‌డం స్టాక్ హోల్డ‌ర్ల‌కు ఉత్తమ మార్గం అనే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇక ట్వీట‌ర్‌ను మ‌స్క్ కొనుగోలు చేస్తున్నార‌నే వార్త‌ల‌తో ట్విట‌ర్ షేర్ 3శాతం పెరిగింది. 

చదవండి👉 ఎలన్‌మస్క్‌కి ట్విటర్‌ బోర్డ్‌ కౌంటర్‌.. తెరపైకి పాయిజన్‌ పిల్‌?

మరిన్ని వార్తలు