అమెరికాకు వచ్చినప్పుడు చేతిలో చిల్లి గవ్వ లేదు: ఎలోన్ మస్క్

17 Dec, 2021 17:52 IST|Sakshi

టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ అమెరికాలో గడిపిన తన ప్రారంభ రోజుల గురించి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అసలు తాను విద్యార్థిగా అమెరికాకు వచ్చిన తొలిరోజుల్లో తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని గుర్తు చేసుకున్నారు. హోల్ మార్స్ కేటలాగ్ అనే వ్యక్తి మస్క్‌ను ప్రశంసిస్తూ ఓ వ్యక్తి ట్వీట్‌ చేశారు.. "ఎలోన్ మస్క్ 17 సంవత్సరాల వయస్సులో అమెరికాకు వచ్చాడు. అతను మన దేశానికి సంపద సృష్టించారు. మస్క్ మన ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎంతో ఆదాయాన్ని కల్పించారు, అలాగే అమెరికా దేశ ఎగుమతులను కూడా పెంచారు. నా అభిప్రాయం ప్రకారం, అతను జాతీయ భద్రతను ముందుకు తీసుకువెళ్ళాడు. మస్క్ మిలియన్ల మందికి ఉద్యోగాలు కల్పించడంతోపాటు ఎంతో మందిని లక్షాధికారులను చేశారు’ అంటూ చాలా గొప్పగా చెప్పారు.

లక్ష డాలర్ల రుణం..
ఆ వ్యక్తి చేసిన ట్వీట్‌కు మస్క్‌ బదులు ఇస్తూ ఇలా అన్నారు.. "నేను చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అమెరికాకు వచ్చాను. పాఠశాలలో ఉన్నప్పుడే రెండు ఉద్యోగాలు చేశాను. స్కాలర్‌షిప్‌ వంటివి వచ్చినప్పటికీ నేను గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసేనాటికి లక్ష డాలర్ల రుణం ఉంది" అని మస్క్ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. మస్క్ చేసిన ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే 48 వేల మందికి పైగా ఆ ట్వీట్‌ను లైక్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధన్యవంతుడైన ఎలన్‌ మస్క్‌ టైమ్ మ్యాగజైన్ "2021 పర్సన్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికచేయబడ్డారు. 

క్రిప్టో మార్కెట్‌ను శాసిస్తున్న మస్క్
సోషల్‌ మీడియాలో మస్క్‌కు అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, అలాగే ఇన్వెస్టర్లకూ ఆయనపై అంతే నమ్మకమని టైమ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది. ముఖ్యంగా క్రిప్టో మార్కెట్‌ను ఒకే ఒక్క ట్వీట్‌తో శాసిస్తూ వస్తున్నాడంటూ మ్యాగజైన్‌ కూడా ఆకాశానికి ఎత్తేసింది. సోలార్‌, రోబోటిక్స్‌, క్రిప్టోకరెన్సీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి ఎన్నో రంగాల్లో తన సత్తా చాటుతున్న మస్క్.. 250 బిలియన్‌ డాలర్లకుపైగా సంపద కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అపర కుబేరుడు ఎలోన్‌ మస్క్‌ కెరీర్‌ తొలిరోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడినట్లు ఆయనే స్వయంగా చెప్పడం ఎంతో మంది యువపారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిని కలిగిస్తోంది.

(చదవండి: Electric Mobility: ఐదేళ్లు.. రూ. 94,000 కోట్ల పెట్టుబడులు)

మరిన్ని వార్తలు