టెస్లాకి షాకిచ్చిన షాంఘై!

10 May, 2022 11:27 IST|Sakshi

ఎన్నో ఆశలతో చైనాలో టెస్లా కార్ల తయారీ కర్మాగారం స్థాపించిన ఈలాన్‌ మస్క్‌కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సప్లై చెయిన్‌ సమస్యలతో షాంఘైలోని టెస్లా గిగా ఫ్యాక్టరీ మరోసారి మూత పడినట్టు సమాచారం. నెల రోజుల వ్యవధిలో టెస్లా ఫ్యాక్టరీ మూత పడటం ఇది రెండోసారి.

ఏషియా మార్కెట్‌పై కన్నెసిన ఈలాన్‌ మస్క్‌ వ్యూహాత్మక భాగస్వామిగా చైనాను ఎంచుకున్నాడు. షాంఘై సమీపంలో బిలియన్‌ డాలర్లు వెచ్చింది టెస్లా గిగా ఫ్యాక్టరీని నిర్మించాడు. ఇక్కడి నుంచి జపాన్‌, ఇండియా, ఇతర ఏషియా దేశాలకు ఎలక్ట్రిక్‌ కార్లు సప్లై చేయాలని భావించాడు. అయితే చైనాలో తయారైన వస్తువుల దిగుమతిపై భారీ సుంకాలు విధిస్తోంది ఇండియా. దీంతో ప్రపంచంలో రెండో పెద్ద మార్కెటైన ఇండియా విషయంలో ఈలాన్‌ మస్క్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. 

ఓ వైపు మార్కెటింగ్‌ సమస్యలు చుట్టుముట్టగా షాంఘైలో కరోనా కేసులు పెరిగిపోవడం కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. మార్చి చివరి నుంచి షాంఘైలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో అక్కడ లాక్డౌన్‌ అమలు చేసింది డ్రాగన్‌ ప్రభుత్వం. దీంతో టెస్లా కార్ల కర్మాగారం మూత పడక తప్పని పరిస్థితి నెలకొంది. 22 రోజుల పాటు ఈ గిగా ఫ్యాక్టరీ షట్‌డవున్‌ అయ్యింది.

షాంఘైలో కొంత మేర పరిస్థితులు చక్కబడటంతో 2022 ఏప్రిల్‌ 19 తిరిగి ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించారు. అయితే కరోనా దెబ్బతో కఠిన లాక్‌డౌన్‌ అమలు చేయడంతో చైనాలో సప్లై వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. కార్ల తయారీలో ఉపయోగించే అనేక ముడి వస్తువల లభ్యత తగ్గిపోయింది. దీంతో ఫ్యాక్టరీ తెరిచినా కార్లు ఉత్పత్తి చేసే పరిస్థితి లేక పోవడంతో మే 9న మరోసారి కర్మాగారానికి తాళం వేసింది టెస్లా. అయితే ఈ మూసివేతపై టెస్లా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. 

చదవండి: ఈలాన్‌మస్క్‌.. అసలు విషయం ఎప్పుడో చెప్పు?

మరిన్ని వార్తలు