భారత్‌తో డీల్‌ జాప్యం.. టెస్లాకు భారీ షాక్‌, మనుజ్‌ ఖురానా రాజీనామా!

14 Jun, 2022 18:50 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో తమ ఈవీ కార్ల ఎంట్రీకి బ్రేకులు వేసిన తరుణంలో.. టెస్లా కంపెనీకి ఇప్పుడు భారీ షాక్‌ తగిలింది. లాబీయింగ్‌లో ఇంతకాలం కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన టెస్లా కంపెనీ భారత ఎగ్జిక్యూటివ్‌ అసహనంతో కంపెనీ నుంచి వైదొలిగినట్లు సమాచారం!. 

భారత్‌లో రంగ ప్రవేశం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన సమయంలో .. టెస్లా కంపెనీ మనుజ్‌ ఖురానాను పాలసీ & బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా నియమించింది టెస్లా. ఐఐఎం బెంగళూరుకు చెందిన మనుజ్‌ ఖురానాకు అప్పటికే మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌లో తొమ్మిదేళ్ల అనుభవం ఉంది. టెస్లాకు భారత్‌లో ఆయనే తొలి ఎంప్లాయ్‌ కూడా!. ఈ మేరకు మార్చి 2021లో ఆయన నియామకం జరిగింది. 

అప్పటి నుంచి టెస్లా తరపున మనుజ్‌ అండ్‌ టీం కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ సూచనల మేరకు.. దిగుమతి సుంకం తగ్గించుకోవాలంటూ భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. ముందుగా తక్కువ దిగుమతి సుంకంతో కార్లను అనుమతించాలని, ఇక్కడి మార్కెట్‌పై ఓ అంచనాకి వచ్చి కార్ల ఉత్పత్తిని మొదలుపెడతామని మనుజ్‌ విజ్ఞప్తి చేశారు. చైనా కూడా ఇదే తరహాలో టెస్లాకు అనుమతులు మంజూరు చేసిందని వివరించారాయన.

అయితే భారత ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో అస్సలు తగ్గలేదు. దీంతో టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ వేదికగా తన అసంతృప్తి వెల్లగక్కుతూ వస్తున్నారు. అయినప్పటికీ మనుజ్‌ తన ప్రయత్నాలను ఆపలేదు. అయితే ముందుగా స్థానిక ఉత్పత్తిని ప్రారంభించాకే.. రాయితీల గురించి చర్చించాలని భారత ప్రభుత్వం తెలిపింది. 

ఈ పరిణామాలతో తాజాగా టెస్లా కంపెనీ భారత్‌ ఎంట్రీని తాత్కాలికంగా పక్కనపెట్టింది. ఇండోనేషియాతో పాటు థాయ్‌లాండ్‌ల పైనా దృష్టిసారించింది. అంతేకాదు భారత్‌లో షోరూంల కోసం వెతికే ప్రయత్నాలను నిలిపివేయడంతో పాటు ఇక్కడి టీంకు వేరే పనులను అప్పజెప్పింది. ఈ క్రమంలోనే.. మనుజ్‌ ఖురానా టెస్లాకు రాజీనామా చేశారు.

భారత్‌లో రంగప్రవేశం విషయంలో టెస్లా వైఖరి వల్లే ఆయన కంపెనీని వీడినట్లు ఓ ప్రముఖ వెబ్‌సైట్‌ కథనం ప్రచురించింది. దీనిపై ఆయన స్పందన కోరగా.. ఆయన అందుబాటులో లేరని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు