ఊహించని పొగడ్త.. ఆ పని చేస్తే ఎలన్‌ మస్క్‌ను టచ్‌ చేసేవాళ్లే ఉండరట!

20 Oct, 2021 12:12 IST|Sakshi

అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌కి ఫ్యాన్‌ పాలోయింగ్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. ధనవంతుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్న తర్వాత ఆయన మీద ఫోకస్‌ విపరీతంగా పెరుగుతోంది. అంతెందుకు భారత్‌ నుంచి ఆనంద్‌ మహీంద్రా, హార్ష్ గోయెంకా లాంటి బిజినెస్‌ టైకూన్‌లు సైతం మస్క్‌ సక్సెస్‌ను సమీక్షిస్తుండడం విశేషం. తాజాగా ఆయన ఖాతాలో మరో ‘ఊహించని’ పొగడ్త పడింది.


అమెరికా బ్యాకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లే, ఎలన్‌ మస్క్‌ సంపాదన మీద తాజాగా ఓ  ఆసక్తికర కథనం విడుదల చేసింది. టెస్లాతో కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న మస్క్‌.. ఈవీ కంపెనీ టెస్లా కంటే సొంత సంస్థ స్పేస్‌ఎక్స్‌తోనే ఖ్యాతిని, సంపదను మరింత పెంచుకునే ఆస్కారం ఉందని మోర్గాన్‌ స్టాన్లేకు చెందిన ఓ అనలిస్ట్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.   

"SpaceX Escape Velocity ... Who Can Catch Them?" పేరుతో మంగళవారం మోర్గాన్‌ స్టాన్లేకు చెందిన ఆడమ్‌ జోన్స్‌  ఒక కథనం రాశారు. బ్లూమరాంగ్‌ ఇండెక్స్‌ ప్రకారం.. మస్క్‌ మొత్తం 241.4 బిలియన్‌ డాలర్ల సంపాదనలో స్పేస్‌ ఏజెన్సీ స్పేస్‌ఎక్స్‌ 17 శాతం వాటా కలిగి ఉంది. ఒకవేళ మస్క్‌ గనుక స్పేస్‌ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ మీద ఫుల్‌ ఫోకస్‌ పెడితే మాత్రం కేవలం స్పేస్‌ఎక్స్‌ ద్వారానే 200 బిలియన్‌ డాలర్లు సంపాదించవచ్చని అభిప్రాయపడ్డారు. తద్వారా ఈ భూమ్మీద తొలి ట్రిలియనీర్‌గా ఎలన్‌ మస్క్‌ ఎదిగే అవకాశం ఉందని, దరిదాపుల్లో ఎవరూ నిలిచే అవకాశమే లేదని జోన్స్‌ ఆ కథనంలో అభిప్రాయపడ్డారు. 

కొసమెరుపు ఏంటంటే.. ఎలన్‌ మస్క్‌కు, మోర్గాన్‌ స్టాన్లేకు మధ్య మంచి సంబంధాలు లేకపోవడం.

చదవండి: బాప్‌రే చంద్రుడిపై రొమాన్స్‌.. రూ.158 కోట్లు నష్టం!

మరిన్ని వార్తలు