పనికిమాలినోడు.. అలాంటి వేస్ట్‌ఫెలోని నా జీవితంలో చూడలేదు - ఎలాన్‌మస్క్‌

4 Jun, 2022 16:28 IST|Sakshi

ఫోర్డ్‌, షెవర్లే, ఫోక్స్‌వ్యాగన్‌లను వెనక్కి తోసి ఇరవై ఏళ్లు నిండకుండానే ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ కంపెనీగా ఎదిగింది టెస్లా. అయితే ఈ కంపెని ఎవరు స్థాపించారు. ఎలాన్‌ మస్క్‌ ఎలా వచ్చాడనే అంశంపై పదేళ్లుగా చర్చ జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ అంశంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఎలాన్‌మస్క్‌.

టెస్లా ఓ గొట్టం కంపెనీ
ఇటీవల ఓ మీడియా సంస్థ చేసిన ఇంటర్యూలో టెస్లా పుట్టుపూర్వోత్తరాలను వివరించాడు ఎలాన్‌ మస్క్‌. తాను టెస్లాలో చేరే నాటికి ఆ కంపెనీ పూర్తిగా ఒక షెల్‌ (గొట్టం) కంపెనీగా ఉందని ఎలాన్‌ మస్క్‌ అన్నారు. పేరుకే ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీగా రిజిస్ట్రర్‌ అయి ఉంది తప్పితే అక్కడ ఎటువంటి డిజైన్లు లేవు, ప్రోటోటైప్‌ లేదు, ఉద్యోగులు ఎవరూ లేరు. కేవలం ఏసీ ప్రొపల్షన్‌తో జీరో కారును తయారు ఆలోచన తప్ప మరేం లేదని ఎలాన్‌ మస్క్‌ స్పష్టం చేశారు. తాను కంపెనీలోకి అడుగు పెట్టిన తర్వాతే టెస్లా రూపురేఖలు మారాయని ఎలాన్‌ మస్క్‌ చెప్పారు.

2003లో..
ఇక టెస్లా విషయానికి వస్తే మార్టిన్‌ ఎబెర్‌హార్డ్‌, మార్క్‌ టార్పెనింగ్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఎలక్ట్రిక్‌ కార్లు తయారు చేసే లక్ష్యంతో 2003లో టెస్లాను ఓ స్టార్టప్‌గా స్థాపించారు. ఆ తర్వాత కాలంలో ఎలాన్‌మస్క్‌తో పాటు జేబీ స్ట్రాబ్యుయేల్‌లు ఈ కంపెనీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో మార్టిన్‌ ఎబెర్‌హర్డ్‌ను బోర్డు నుంచి తొలగించారు. ఆ సమయంలో అతని పక్షనా ఎవరూ నిలవలేదు. దీనిపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

స్థాపించింది ఎవరు
టెస్లా స్థాపన అది ఎదిగిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ వస్తున్నాయి. చాలా మంది ఎబెర్‌హార్డ్‌ పెట్టిన కంపెనీని ఎలాన్‌ మస్క్‌ అతని బృందం అప్పనంగా దోచుకున్నారనే విధంగా కామెంట్లు చేస్తుంటారు. ఇప్పటికీ దీనిపై మస్క్‌ అనేక సార్లు వివరణ ఇచ్చినా.. ప్రశ్నల పరంపర.. అనుమానపు చూపులు మాత్రం ఆగడం లేదు. ఈ వరుసలోనే ఎబర్‌హర్డ్‌ను ఎందుకు బయటకు పంపాల్సి వచ్చిందనే ప్రశ్న మస్క్‌కి తాజా ఇంటర్యూలో ఎదురైంది. 

పనికిమాలినోడు
టెస్లాను స్థాపించడం తప్పితే ఎబర్‌హర్డ్‌కి సంబంధించి పెట్టుబడి లేదని ఎలాన్‌మస్క్‌ వివరించాడు. పైగా అతని పనితీరు దారుణంగా ఉండేందని తెలిపారు. కేవలం టెస్లా నుంచి బయటకు వెళ్లాక.. ఈ కంపెనీని తానే స్థాపించినట్టు బలంగా ప్రచారం చేసుకోవడం మినహా అతను ఏమీ సాధించలేదని మస్క్‌ దుయ్యబట్టారు. ఎబర్‌హార్డ్‌ లాంటి పనికి మాలిన వాడిని తానెప్పుడూ చూడలేదన్నారు ఎలాన్‌మస్క్‌. టెస్లా ఎదుగుదలకు తాను, జేబీ స్ట్రాబ్యుయేల్‌ ఇతర బృందం తీవ్రంగా శ్రమించామని తెలిపారు. 

గత ఏప్రిల్‌లో
టెస్టా కంపెనీ ఎవరు స్థాపించారు. తాను ఎలా కంపెనీలోకి వచ్చింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఈ ఏడాది రెండోసారి వివరించారు ఎలాన్‌మస్క్‌. గత ఏప్రిల్‌లో ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు కూడా ఎలాన్‌మస్క్‌ ఓపిగ్గా బదులిచ్చాడు.

చదవండి: కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో కెమెరా కంటికి చిక్కిన ఎలాన్‌ మస్క్‌

మరిన్ని వార్తలు