-

మరో నెలలో రూ.625 కోట్లు నష్టపోనున్న మస్క్‌.. ఎలాగంటే..?

27 Nov, 2023 11:17 IST|Sakshi

ఎలాన్‌మస్క్‌కు చెందిన సోషల్‌మీడియా దిగ్గజ కంపెనీ ‘ఎక్స్‌’ త్వరలో ఈ ఏడాది చివరినాటికి భారీగా నష్టపోనుందని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది. ఎక్స్‌ ద్వారా చాలా కంపెనీలు తమ ప్రొడక్ట్‌లను ప్రచారం చేస్తాయి. అయితే అందులో ప్రధాన బ్రాండ్‌ కంపెనీలు వాటి ప్రచారాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపివేయనున్నట్లు తెలిసింది. దాంతో ఆ కంపెనీల ద్వారా ఎక్స్‌కు వచ్చే ఆదాయం రూ.625 ​కోట్లు తగ్గనుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

గత వారం ఎలాన్‌మస్క్‌ ఎక్స్‌ వేదికగా యూదులకు వ్యతిరేకంగా ఉన్న ఒక పోస్ట్‌ను సమర్థించాడు. దాంతో వాల్ట్ డిస్నీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో సహా కొన్ని కంపెనీలు ఎక్స్‌లో తమ ప్రకటనలు కొంతకాలం నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. గతంలో యాపిల్, ఒరాకిల్‌తో సహా ప్రధాన కంపెనీలకు చెందిన ప్రకటనలు అడాల్ఫ్ హిట్లర్,  నాజీ పార్టీని ప్రచారం చేసే కొన్ని పోస్ట్‌ల పక్కన కనిపించాయి. దాంతో ఆ కంపెనీలు ఎక్స్‌ మీడియా, వాచ్‌డాగ్ గ్రూప్ మీడియాపై దావా వేసినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి.

న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈవారం ఎయిర్‌ బీఎన్‌బీ, అమెజాన్‌, కోకకోలా, మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన దాదాపు 200 యాడ్ సంస్థలు వివిధ సోషల్‌ మీడియాల్లో తమ ప్రకటనలు లిస్ట్‌ చేశాయి. కానీ వాటిలో కొన్నింటిని త్వరలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 

ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు!

అక్టోబర్ 2022లో మస్క్ ఎక్స్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి చాలా కంపెనీలకు చెందిన ప్రకటనదారులు యాడ్‌లను తగ్గించినట్లు సమాచారం. సైట్‌లో ద్వేషపూరిత ప్రసంగాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. మస్క్ ఎక్స్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి యూఎస్‌ ప్రకటనల ఆదాయం ప్రతి నెలా దాదాపు 55 శాతం తగ్గుతుందని రాయిటర్స్ గతంలో తెలిపింది.

మరిన్ని వార్తలు