స్కోడా వోక్స్‌వ్యాగన్‌కు సుప్రీంలో చుక్కెదురు

27 Nov, 2020 08:40 IST|Sakshi

ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలన్న అభ్యర్థన తిరస్కరణ

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్‌ ఇండియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డీజిల్‌ కారులో ఉద్గార నిబంధనలను తారుమారు చేసేందుకు మోసపూరిత పరికారాన్ని (చీట్‌ డివైజ్‌) కంపెనీ ఏర్పాటు చేసిందంటూ ఉత్తరప్రదేశ్‌లో ఓ వినియోగదారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. దీన్ని కొట్టివేయాలని కోరుతూ స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్‌ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించినా కోరుకున్న ఫలితం దక్కలేదు. వాహనాల్లో చీట్‌ డివైజ్‌ల ఏర్పాటుపై కచ్చితంగా విచారణ జరగాల్సిందేనని అలహాబాద్‌ హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేవేస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో విచారణ ఎందుకు కొనసాగించరాదంటూ ఈ నెల 4న విచారణలో భాగంగా ప్రశ్నించిన ధర్మాసనం.. తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ‘చీట్‌’ లేదా ‘డిఫీట్‌ డివైజ్‌’ అన్నది సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఓ పరికరం. దీన్ని ఆటో ఇంజన్లలో అమర్చడం ద్వారా కాలుష్యం విడుదల పరీక్షల ఫలితాలను తారుమారు చేయగలదు. ఈ విషయంలో అంతర్జాతీయంగా వోక్స్‌వ్యాగన్‌ కొన్నేళ్ల క్రితం ఆరోపణలను కూడా ఎదుర్కొన్నది. ఈ కేసులో స్కోడా వోక్స్‌వ్యాగన్‌ రూ.671.34 కోట్ల పరిహారం చెల్లించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ గతంలో ఆదేశాలు జారీ చేసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా