ఎకానమీకి పీఎల్‌ఐ దన్ను: ఎంకే నివేదిక

6 Jul, 2022 15:47 IST|Sakshi

వార్షికంగా జీడీపీకి 4 శాతం లాభం

ఎంకే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ నివేదిక అంచనా  

ముంబై: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) భారత్‌ ఎకానమీకి వెన్నుదన్నుగా నిలవనుందని ఎంకే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ (బ్రోకరేజ్‌ ఎంకే గ్లోబల్‌  పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగం) నివేదిక విశ్లేషించింది. వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ. 2.4 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను అందించడం ద్వారా కీలకరంగాల్లో తయారీ పెంచేందుకు ఉద్దేశించిన ఈ పథకం, వార్షికంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 4 శాతం అదనపు విలువను జోడించవచ్చని నివేదిక అభిప్రాయపడింది. ఇప్పటివరకు ఈ పథకం ఎల్రక్టానిక్స్, ఆటో కాంపోనెంట్స్,  ఫార్మా రంగాల నుండి గరిష్ట స్పందనను చూసిందని వివరించింది.

నివేదికలో మరికొన్ని అంశాలన పరిశీలిస్తే.. 
► పీఎల్‌ఐ పథకం విజయవంతం కావడానికి చైనా ప్లస్‌ 1 వ్యూహమే కారణం.  మహమ్మారి ప్రారంభమైన  నుండి  చైనాలో పెట్టుబడులకు అనేక పాశ్చాత్య కంపెనీలు, ప్రభుత్వాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి. తాజా లాక్‌డౌన్‌లు ఆ దేశంలో సరఫరాల సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయి. దీనికితోడు ఆ దేశానికి చెందిన అనేక వస్తువులపై అభివృద్ధి చెందిన దేశాలు యాంటీ డంపింగ్‌ డ్యూటీలను
విధించాయి. 
► ఉత్పాదక కంపెనీలు బలమైన రాబడుల కారణంగా సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. కంపెనీలు విస్తరిస్తున్నాయి. నమోదైన కొత్త తయారీ కంపెనీల సంఖ్యను బట్టి ఇది స్పష్టమవుతుంది. 
► తయారీ కంపెనీల నమోదు గత ఏడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. మొత్తం  రిజిస్ట్రేషన్లలో తయారీ కంపెనీల వాటా గత దశాబ్దం నుండి దాదాపు అత్యధిక స్థాయిలో ఉండడం గమనార్హం.  
► మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోరిన-మంజూరైన పర్యావరణ అనుమతుల సంఖ్య అత్యధికంగా ఉంది. 2018-21లో ఆవిష్కరించిన నిర్మాణాత్మక మార్పులు ఎకానమీపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. 2003-06లో నెలకొన్న సానుకూల పరిస్థితులను తాజా పరిణామాలు గుర్తుకు తెస్తున్నాయి.  
► నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు తొలిరోజుల్లో దేశీయ తయారీ రంగం దెబ్బతింది. తాజాగా మహమ్మారి వినియోగదారుల డిమాండ్‌పై ప్రభావం చూపింది. ఆయా పరిస్థితుల నుంచి ఎదురైన సవాళ్లు తయారీ పరిశ్రమపై కొనసాగుతున్నాయి. మూలధన సవాళ్లు, సమస్యలు ఇంకా తొలగిపోలేదు.  
► 2021-22లో తలసరి ఆదాయం 2020-21కన్నా పెరిగింది. మార్చితో ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరం నుండి విచక్షణాపరమైన ఆదాయం పెరిగే అవకాశం ఉంది.


రూపాయి బలహీనత బలం... 
చైనీస్‌ యువాన్‌తో రూపాయి విలువ క్షీణించడం భారత్‌  తయారీ రంగానికి సానుకూలంగా మారింది.  ఈ పరిణామాల వల్ల ఆటో, ఆటో విడి భాగాలు, వ్రస్తాలు, రసాయనాలు, భారీ పరిశ్రమలకు సంబంధించి క్యాపిటల్‌ గూడ్స్‌ ప్రయోజనం పొందుతున్నాయి.  
– వికాస్‌ ఎం సచ్‌దేవా,  ఎంకే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ సీఈఓ   

మరిన్ని వార్తలు