రాజస్థాన్‌లో మండిపోతున్న ఎండలు.. సైకిల్‌పై జొమాటో డెలివరీ.. ఆ తర్వాత..

12 Apr, 2022 15:45 IST|Sakshi

రాజస్థాన్‌కి చెందిన ఓ జొమాటో డెలివరీ బాయ్‌ కథ నెట్టింట వైరల్‌గా మారింది. ఎర్రటి ఎండలో ఆ జొమాటో డెలివరీ బాయ్‌ పడుతున్న కష్టం.. దాన్ని గుర్తించిన ఓ యూజర్‌.. వెంటనే స్పందించిన నెటిజన్లు.. వెరసి ఓ స్ఫూర్తినిచ్చే ఘటనగా మారింది. 

రాజస్థాన్‌కి చెందిన ఆదిత్యశర్మ ఏప్రిల్‌ 11న మధ్యాహ్నం జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు. కాసేపటికే ఆర్డర్‌ వచ్చింది. తీసుకుందామని వెళ్లిన ఆదిత్యకు అక్కడ కనిపించిన దృశ్యం కదిలించి వేసింది. రాజస్థాన్‌లో తీవ్రంగా ఎండలు కొడుతున్న వేళ ఓ వ్యక్తి మిట్టమధ్యాహ్నం చెమటు కక్కుకుంటూ సైకిల్‌పై జొమాటో ఆర్డర్లు డెలివరీ చేయడం అతన్ని కలిచి వేసింది. దీంతో ఆర్డర్‌ తీసుకుని అతనితో మాటలు కలిపాడు.

కష్టాల్లోకి నెట్టిన కరోనా
సైకిల్‌పై డెలివరీ సర్వీస్‌ చేస్తున్న ఆ వ్యక్తి పేరు దుర్గామీనా అని. బీకామ్‌ చదివిన దుర్గా మీనా దాదాపు పన్నెండేళ్లు టీచింగ్‌ ఫీల్డ్‌లో ఉన్నాడు. అయితే కరోనా కష్టకాలంలో అతని ఉద్యోగం పోయింది. దీంతో జొమాటో డెలివరీ బాయ్‌గా మారాడు. క్షణం తీరిక లేకుండా పని చేసినా సైకిల్‌ మీద పది నుంచి పన్నెండు డెలివరీలు ఇవ్వడం వీలు కావడం లేదు. కొత్త బైకు కొనుక్కునేందుకు డబ్బులు కూడబెడుతున్నా కనీసం డౌన్‌ పేటెంట్‌కు కావాల్సినంత అమౌంట్‌ కూడా కూడటం లేదని తెలిసింది.

డౌన్‌పేమెంట్‌ కడితే చాలు
తన కష్టాలు వింటున్న ఆదిత్య ముందు మరో ప్రపోజల్‌ ఉంచాడు దుర్గామీనా. తనకు డౌన్‌పేమెంట్‌ చెల్లంచి బైక్‌ కొనిస్తే ఇంకా ఎక​‍్కువ డెలివరీలు చేస్తానని అదనంగా వచ్చే డబ్బుతో నెలవారీ ఈఎంఐలు కట్టుకోవడంతో పాటు డౌన్‌పేమెంట్‌గా అందించిన సాయాన్ని నాలుగు నెలల్లో ఇస్తానంటూ తెలిపాడు. అంతేకాదు ఎవరైనా ట్యాబ్‌, వైఫై సౌకర్యం కల్పించినా టీచింగ్‌ చేసుకుంటానంటూ మరో ప్రతిపాదన ఆదిత్య ముందు ఉంచాడు దుర్గామీనా.

ట్విట్టర్‌ స్టోరీ
మండే ఎండలో సైకిల్‌పై డెలివరీ చేస్తున్న దుర్గామీనా ఫోటోను జత చేసి.. మొత్తం స్టోరీని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు ఆదిత్య శర్మ. దుర్గామీనా బైక్‌ కొనుక్కునేందుకు కనీసం ఒక్క రూపాయి అయినా సాయం చేయాలంటూ నెటిజన్లను కోరుతూ 2022 ఏప్రిల్‌ 11 మధ్యాహ్నం 3:57 గంటలకు మెసేజ్‌ పెట్టాడు. సరిగ్గా 24 గంటలు గడవక ముందే దుర్గామీనా బైక్‌ కొనేందుకు అవసరమైనంత సొమ్ము క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా అందింది.

బైక్‌ ఆగయా..
కేవలం 24 గంటల్లోనే దుర్గామీనాను ఆదుకునేందుకు నెటిజన్లు భారీగా స్పందించారు. దుర్గామీనా సొంతం చేసుకోబోయే బైకు ఫోటోను 2022 ఏప్రిల్‌ 12 మధ్యాహ్నం 1:30 గంటలకు ఆదిత్య శర్మ పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ సైకిల్‌ డెలివరీ బాయ్‌ కథనం నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియా స్ట్రెంథ్‌, క్రౌడ్‌ ఫండింగ్‌ ప్రభావం ఎంటో తెలియజెప్పింది.


చదవండి: అలా చేస్తేనే రైతుల ఆదాయం రెట్టింపు 

మరిన్ని వార్తలు