సిబ్బంది కోసం ఎడిటర్‌ షాకింగ్‌ నిర్ణయం.. మామూలు త్యాగం కాదంటు ప్రశంసలు!

27 Dec, 2022 21:41 IST|Sakshi

త్యాగం అనే పేరు సినిమాల్లో ఎక్కువగా ఉంటాం. కానీ అదే త్యాగాన్ని నిజ జీవితంలో ప్రజలు పాటించడం చాలా అరుదనే చెప్పాలి. అలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన సిబ్బంది కోసం తన ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లోకి వచ్చింది. అసలు ఆ స్టోరీ ఏంటంటే! అమెరికా మిచిగాన్‌లోని డెట్రాయిట్‌ కేంద్రంగా పనిచేసే అతిపెద్ద వార్తా పత్రిక  డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్. ఆ సంస్థ ఎడిటర్, వైస్ ప్రెసిడెంట్ పీటర్ భాటియా తీసుకున్న గొప్ప నిర్ణయం ప్రస్తుతం ఆ ప్రాంతమంతా చర్చనీయాంశమైంది.

షాకింగ్‌ డెసిషన్‌
వివరాల్లోకి వెళితే.. ఎప్పటిలానే పీటర్‌ డిసెంబర్ 23న తమ సిబ్బందితో వర్చువల్‌గా సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. అందులో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది సాధారణమైన విషయమే కానీ తన రిజైన్‌ వెనుక ఉన్న నిజం తెలిస్తే ఎవరైనా శభాష్‌ పీటర్‌ అని అనాల్సిందే. ఇటీవలి కాలంలో ప్రపంచవాప్తంగా పలు కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి లేఆఫ్స్ దారిలో వెళుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ అదే దారిని అనుసరించాలని నిర్ణయించుకుంది. ఇది ఆ సంస్థ ఎడిటర్ పీటర్‌కు ఏ మ్రాతం ఇష్టం లేదు. ఉద్యోగుల తొలగింపులు ఇష్టపడని ఆయన ఓ నిర్ణయం తీసుకున్నాడు. స్వయంగా ఆయనే తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

తన రాజీనామకు కారణం ఇదే
సంస్థ బడ్జెట్‌లో తన జీతం ఆదా చేయడం వల్ల కొంతమంది సిబ్బంది వారి ఉద్యోగాలు కోల్పోకుండా ఆపే అవకాశం ఉందని పీటర్‌ భావించారు. అంతేకాకుండా తనకు ఇతర ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. బలవంతపు తొలగింపుల వల్ల న్యూస్‌రూమ్ ప్రభావితమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా డిసెంబర్ 12న తొలగింపు నిర్ణయం సిబ్బందికి తెలిపారు.ఈ లేఆఫ్‌ల కారణంగా ఐదుగురు రిపోర్టర్లు, నలుగురు అసిస్టెంట్ ఎడిటర్‌లు, ముగ్గురు వెబ్‌సైట్ ప్రొడ్యూసర్‌లు, ఒక ఫోటోగ్రాఫర్, ఒక ఎడిటోరియల్ అసిస్టెంట్ వరకు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అందుకే పీటర్‌ తన రాజీనామాకు సిద్ధమయ్యారు.

అందులోని ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. సృజనాత్మక నాయకుడిగా ఉన్న భాటియా కారణంగా ఫ్రీ ప్రెస్ ప్రస్తుతం గానెట్ నెట్‌వర్క్‌లోని బలమైన ప్రచురణలలో ఒకటిగా పేరు సంపాదించిందని చెప్పాడు. భాటియా భర్తీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అతను ఆశిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల నుంచి తన భర్తీని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు భాటియా స్వయంగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు