వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దంటే చెప్పండి..జాబ్‌కు రిజైన్‌ చేస్తాం,ఇప్పటికే వందల మంది!

13 May, 2022 21:23 IST|Sakshi

సుదీర్ఘ కాలంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఇంటికే పరిమితమైన ఉద్యోగులు.. తిరిగి ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాదని ఆఫీస్‌కు రమ్మంటే..జాబ్‌ రిజైన్‌ చేసేందుకు ఉద్యోగులు వెనుకాడడం లేదని ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. 


బ్లూమ్‌బెర్గ్ ప్రకారం..వెయ్యి మంది ఉద్యోగులపై జరిపిన సర్వేలో 39శాతం మంది ఉద్యోగులు తమపై స్థాయి అధికారులు తమని వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసేందుకు అనుమతించకపోతే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేస్తామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తేలింది. మిలీనియల్స్, జెన్‌ జెడ్‌ కేటగిరి(1990 నుంచి 2010 మధ్య కాలంలో జన్మించిన వారు)కి చెందిన ఉద్యోగులు 49శాతం మంది ఇంటి నుండి పని చేసే సామర్ధ్యం ఉందని, అలా చేయడం వల్ల వర్క్‌ ప్రొడక్టివిటీ పెరుగుతుందని చెబుతున్నారు.  

యాపిల్‌ నుంచి వైట్‌ హాట్‌ జూనియర్‌ దాకా
ప్రపంచ దేశాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దన్నందుకు ఇప్పటికే వందల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. రెండు రోజుల క్రితం యాపిల్‌ సంస్థ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దని, ఆఫీస్‌కు వచ్చి చేయాలన్న కారణంగా యాపిల్‌ సంస్థ ఏఐ డైరెక్టర్‌ ఇయాన్‌ గుడ్‌ఫెల్‌ తన జాబ్‌కు రిజైన్‌ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఆ మరుసటి రోజే బైజూస్‌కు చెందిన కోడింగ్‌ స్టార్టప్‌ వైట్‌ హాట్‌ జూనియర్‌కు చెందిన 800మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కారణం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి చెప్పి ఆఫీస్‌ రావాలని ఉద్యోగుల్ని కోరడమే. 

పీచే ముడ్‌
అందుకే దిగ్గజ సంస్థలు రిటర్న్‌ టూ ఆఫీస్‌కు బదులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయి. కరోనా ప్రభావం ఎలా ఉన్నా..ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వర్క్‌ కల్చర్‌ను అమలు చేయాలని భావిస్తున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన కంపెనీలతో పాటు మనదేశానికి చెందిన కంపెనీలు సైతం ఉద్యోగులు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడానికి అనుమతిస్తున్నాయి. టాటా స్టీల్ నుండి ట్విట్టర్ వరకు అనేక సంస్థలు ఇప్పుడు తమ ఉద్యోగులు శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి.

చదవండి👉జీతం రూ.8కోట్లు..వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దన్నారని జాబ్‌కు రిజైన్‌ చేశాడు!

మరిన్ని వార్తలు