చేజారే నీటికి సరికొత్త ‘పవర్‌’

27 Jun, 2021 10:04 IST|Sakshi

కొండ కోనల్లో విద్యుదుత్పత్తి

పంప్డ్‌ స్టోరేజీ,     మినీ హైడల్స్‌కు ప్రణాళిక

2030 నాటికి భారీగా జల విద్యుత్‌

సిద్ధమవుతున్న సమగ్ర నివేదికలు

గ్రీన్‌ ఎనర్జీ పెంచే దిశగా అడుగులు

ఇంధన శాఖ తాజా నివేదిక 

సాక్షి, అమరావతి: కొండ కోనల్లో వృధా అవుతున్న నీటిని విద్యుదుత్పత్తి వనరులుగా మార్చేందుకు ప్రణాళిక తయారవుతోంది. కాలుష్యానికి కళ్లెం వేసే గ్రీన్‌ ఎనర్జీని పెద్దఎత్తున ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు ఇంధనశాఖ ఇటీవల నివేదిక రూపొందించింది. దీని ప్రకారం ప్రస్తుతం 1,700 మెగావాట్లు ఉన్న జల విద్యుత్‌ వచ్చే పదేళ్లలో 7,700 మెగావాట్లకు పెరగనుంది. తద్వారా రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు మరింత చౌకగా కరెంట్‌ అందుబాటులోకి వచ్చే వీలుంది. మినీ హైడల్స్, పంప్డ్‌ స్టోరేజీలకు అనువైన ప్రాంతాలను ఏపీలో అధికారులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 31 వేల మెగావాట్ల విద్యుత్‌ని, వీటి ద్వారా ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నారు. తొలిదశలో 6 వేల మెగావాట్ల జల విద్యుదుత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీనికి సంబంధించి సమగ్ర నివేదికలు (డీపీఆర్‌) శరవేగంగా రూపొందిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న సమయం(పీక్‌ అవర్స్‌)లో కూడా జల విద్యుత్‌ను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. 
పంప్డ్‌ స్టోరేజీలు అంటే...
నదులు, వాగుల్లో నీటిని ఎగువ ప్రాంతంలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకుని జల విద్యుదుత్పత్తి చేస్తారు. నిజానికి కొన్ని సందర్భాల్లో సౌర, పవన విద్యుత్‌ ఎక్కువగా వస్తుంది. దీన్ని వినియోగించుకునేందుకు థర్మల్‌ ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తోంది. దిగువ నుంచి ఎగువకు నీటిని పంపే పంప్డ్‌ స్టోరేజీల్లో ఈ విద్యుత్‌ను వాడుకుంటారు. రాత్రి సమయంలో సౌర విద్యుత్‌ ఉండదు. అలాంటప్పుడు డిమాండ్‌ను పంప్డ్‌ స్టోరేజీలు భర్తీ చేస్తాయి. ఇవి కాకుండా కొండ ప్రాంతాల్లో జలపాతాల నుంచి జాలువారే నీటిని ఒక చోట ఆనకట్ట ద్వారా నిల్వ చేస్తారు. దీనిద్వారా  విద్యుదుత్పత్తి చేస్తారు. వీటిని మినీ హైడల్స్‌ అని వ్యవహరిస్తారు.
కాలుష్యానికి కట్టడి
థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల వల్ల వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు పంప్డ్‌ స్టోరేజీ  తరహా జల విద్యుత్‌ తోడ్పడుతుంది. గ్రీన్‌ ఎనర్జీ పెంచే దిశగా  కేంద్ర ప్రభుత్వం ఇటీవల సరికొత్త నిబంధనలు తెచ్చింది. పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలంటే 30 శాతం జల విద్యుత్‌ లభ్యత ఉండాలని సూచించింది. రాష్ట్రంలో 1,700 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. దీన్ని 2030 నాటికి 7,700 మెగావాట్లకు పెంచనున్నారు. జల విద్యుత్‌ చౌకగా లభిస్తుంది. ప్లాంట్‌ నెలకొల్పిన 70 ఏళ్ల వరకూ ఉత్పత్తికి ఢోకా ఉండదు. మొదటి 25 ఏళ్లలోనే నిర్మాణ వ్యయం తీరిపోతుంది. ఆ తర్వాత మరింత చౌకగా విద్యుత్‌ అందుతుంది. మాచ్‌ఖండ్‌ నుంచి ప్రస్తుతం యూనిట్‌ 90 పైసలకే విద్యుత్‌ వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పంప్డ్‌ స్టోరేజీల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.  

చదవండి : అంబానీ వర్సెస్‌ అదానీ.. ఇద్దరి టార్గెట్‌ అదే

మరిన్ని వార్తలు