అమ్మకానికి బంకర్‌.. అణుదాడి జరిగినా తప్పించుకోవచ్చు!

20 Nov, 2022 09:04 IST|Sakshi

అంతర్యుద్ధ కాలానికి చెందిన బంకర్‌ ఒకటి కారుచౌకగా అమ్మకానికి వచ్చింది. అణుబాంబుల దాడి నుంచి తప్పించుకునే ఉద్దేశంతో కట్టుదిట్టంగా నిర్మించిన ఈ బంకర్‌ ఇంగ్లండ్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన లెగ్‌బోర్న్‌ ప్రాంతంలో ఉంది. అంతర్యుద్ధ కాలానికి చెందిన చాలాబంకర్లు ఇటీవలి కాలంలో సెల్‌ఫోన్‌ టవర్లుగా రూపాంతరం చెందినా, లింకన్‌షైర్‌లోని ఈ బంకర్‌ మాత్రం యథాతథంగా నిలిచి ఉంది.

దీనిని 1959లో నిర్మించారు. లోపల చూస్తే, ఇది ఒక సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లా ఉంటుంది. ఒకవేళ అణుదాడి జరిగితే, అప్పుడు ముగ్గురు మనుషులు తలదాచుకోవడానికి వీలుగా ఇందులో ఒక ప్రత్యేక సొరంగం కూడా ఉంది. మార్క్‌ కోలెడ్జ్‌ అనే వ్యక్తి 2003లో దీనిని 12,500 పౌండ్లకు (రూ.11.65 లక్షలు) ఈ–బే వేలంలో సొంతం చేసుకున్నాడు. ఇప్పుడాయన దీనిని 25,000 పౌండ్లకు (రూ.23.31 లక్షలు) అమ్మకానికి పెట్టాడు. బాడీబ్యాగ్‌లు, గ్యాస్‌మాస్క్‌లు, అణుదాడులు జరిగినా పనిచేయగల ప్రత్యేకమైన రెడ్‌ టెలిఫోన్‌ వంటి సౌకర్యాలు ఉన్న ఈ బంకర్‌ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి!

మరిన్ని వార్తలు