బంగారానికి ‘ద్రవ్యోల్బణం’ భరోసా

12 Nov, 2021 04:48 IST|Sakshi

ముంబైలో ఒకేరోజు రూ.980 అప్‌

అంతర్జాతీయంగా 1,900 డాలర్ల దిశగా పయనం...

ముంబై: ద్రవ్యోల్బణం భయాలు, డాలర్‌ ఇండెక్స్‌ బలోపేతం వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధర మళ్లీ రికార్డు స్థాయిల వైపు నడుస్తోంది. అమెరికా, చైనా, భారత్‌వంటి దేశాల్లో ద్రవ్యోల్బణం భయాలు తీవ్రమవుతున్నాయి. దీనితో పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు తక్షణం పడిడివైపు చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– నైమెక్స్‌లో  ఔన్స్‌ (31.1గ్రా) ధర 1,900 డాలర్ల దిశగా కదులుతోంది. ఈ వార్త రాస్తున్న 11 గంటల సమయంలో బుధవారం  ముగింపుతో పోల్చితే ఔన్స్‌ 20 డాలర్ల లాభంతో 1,865 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా ధర అంతర్జాతీయ సరళిని అనుసరిస్తోంది.

అంతర్జాతీయంగా బులిష్‌ ధోరణితోపాటు రూపాయి బలహీనత కూడా  దేశంలో బంగారానికి వరంగా మారుతోంది.  దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌)లో ధర 10 గ్రాములకు రూ. 400 లాభంతో 49,250 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశంలో ప్రధాన స్పాట్‌ మార్కెట్‌ ముంబైలో  ధర క్రితంతో పోల్చితే 99.9 స్వచ్చత 10 గ్రాముల ధర రూ.980 లాభంతో రూ.49,351 వద్ద ముగిసింది. 99.5 స్వచ్చత ధర రూ.976 పెరిగి రూ.49,153 వద్దకు చేరింది. కేజీ వెండి ధర రూ.1,814 పెరిగి రూ.66,594 వద్ద ముగిసింది. ఢిల్లీ స్పాట్‌ మార్కెట్‌లో పసిడి కూడా ధర రూ.883 పెరిగి రూ.48,218 వద్ద  ముగిసింది. వెండి కేజీ ధర రూ.1,890 ఎగసి రూ.65,190కి చేరింది.

మరిన్ని వార్తలు