ఎంట్రి లెవల్‌ కార్ల అమ్మకాలు ఢమాల్..కొనేవారు కరువయ్యారు..! కానీ..!

17 May, 2022 17:37 IST|Sakshi

ముంబై: ఆటోమొబైల్‌ పరిశ్రమపై కోవిడ్‌–19 ప్రభావాలు ఇంకా కొనసాగుతున్నాయి. కరోనా వైరస్‌ పరిణామాలతో సామాన్యుల ఆదాయాల సెంటిమెంటు గణనీయంగా దెబ్బతింది. దీంతో ఎంట్రీ స్థాయి కార్లు కొనుక్కోవాలనుకునే వారు లేదా అప్‌గ్రేడ్‌ అవ్వాలనుకునేవారు తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 

సంపన్న వర్గాల ఆదాయాలకేమీ ఢోకా లేకపోవడంతో ప్రీమియం కార్ల (రూ. 10 లక్షలు పైబడినవి) అమ్మకాలు మాత్రం గణనీయంగా వృద్ధి చెందనున్నట్లు నివేదిక పేర్కొంది. ద్విచక్ర వాహనాల విభాగంలో అధిక రేటు ఉండే (రూ. 70,000 పైగా) టూ–వీలర్ల వాటా 40 శాతం స్థాయిలో ఉండనున్నట్లు వివరించింది. దేశీయంగా సాధారణంగా తొలిసారి కొనుగోలు చేసేవారు, లేదా సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల నుంచి అప్‌గ్రేడ్‌ అవ్వాలనుకుంటున్న వారు ఎంట్రీ స్థాయి కార్లపై దృష్టి పెడుతుంటారు. సరఫరాపరమైన సమస్యలు వాహనాల తయారీ సంస్థలన్నింటిపైనా ప్రభావం చూపుతున్నప్పటికీ, ఎంట్రీ లెవెల్‌ కన్నా ఎక్కువ రేటు ఉండే మోడల్స్‌పై కొనుగోలుదారుల ఆసక్తి కొనసాగుతోందని క్రిసిల్‌ నివేదిక వివరించింది. 

ప్రీమియం.. అయిదు రెట్లు అధికం.. 
గత ఆర్థిక సంవత్సరం చౌక ధరల కార్లతో పోలిస్తే ప్రీమియం సెగ్మెంట్‌ వాహనాలు అయిదు రెట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఎంట్రీ కార్ల విభాగం 7 శాతం పెరగ్గా ప్రీమియం విభాగం విక్రయాలు 38 శాతం వృద్ధి నమోదు చేశాయి. దీంతో ప్రీమియం కార్ల మార్కెట్‌ వాటా 500 బేసిస్‌ పాయింట్లు పెరిగి సుమారు 30 శాతానికి చేరింది. సంపన్నుల ఆదాయాలపై పెద్దగా ప్రతికూల ప్రభావాలు లేకపోవడం, ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ మార్కెట్లోకి వస్తుండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్‌ వివరించింది. అలాగే అధిక రేటు ఉండే టూ–వీలర్లవైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండటం, మరిన్ని మోడల్స్‌ అందుబాటులో ఉండటం తదితర అంశాల కారణంగా మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో వీటి వాటా 40 శాతం స్థాయిలో కొన్నాళ్లు కొనసాగవచ్చని పేర్కొంది.  

రేటు ఎక్కువ .. చాయిస్‌ తక్కువ.. 
కఠిన భద్రతా ప్రమాణాలు (యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్లు మొదలైనవి) అమలు చేయాల్సి రావడం వల్ల గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో చౌక కార్ల రేట్లు 15–20 శాతం మేర పెరిగాయి. ఎంట్రీ లెవెల్‌ కార్ల ధరలు గణనీయంగా పెరగడం, మోడల్స్‌ లభ్యత తక్కువగా ఉండటం (కొన్ని సంస్థలు ఈ విభాగం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి) వంటి అంశాలు ఒక మోస్తరు ఆదాయాలుండే కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. క్రిసిల్‌ నివేదిక ప్రకారం .. పెద్ద, మధ్య స్థాయి కంపెనీల్లో ఉద్యోగులపై వెచ్చించే వ్యయాలు, చిన్న స్థాయి సంస్థల్లో కన్నా ఎక్కువగా పెరిగాయి. తదనుగుణంగానే అధికాదాయం ఆర్జించే పెద్ద సంస్థల ఉద్యోగులు ఎక్కువ వెచ్చించి ప్రీమియం కార్లను కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరల్లో కార్లను కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య ఎక్కువగా చిన్న స్థాయి సంస్థల్లోనే ఉంటుంది. ఇలాంటి సంస్థల్లో ఉద్యోగులపై వ్యయాలు పెద్దగా పెరగని నేపథ్యంలో ఆదాయాల సెంటిమెంటు ఆశావహంగా లేకపోవడం వల్ల వారు కొనుగోలు నిర్ణయాలు వాయిదా వేసుకుంటున్నట్లు క్రిసిల్‌ తెలిపింది. ఆదాయాల సెంటిమెంట్‌ను మదింపు చేసేందుకు ఈ విధానాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు వివరించింది.  

ప్రీమియంలో సెకండ్‌ హ్యాండ్‌ అయినా ఓకే.. 
రేట్లు పెరిగిపోయిన కొత్త ఎంట్రీ లెవెల్‌ కారుకు బదులు అదే ధరకు వస్తున్న ఖరీదైన సెకండ్‌ హ్యాండ్‌ కారునయినా కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని క్రిసిల్‌ తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో మారుతీ ఆల్టో, స్విఫ్ట్, డిజైర్‌ వంటివి, హ్యుందాయ్‌ ఐ10, ఐ20 మొదలైన ప్రాథమిక స్థాయి వాహనాల అమ్మకాల వాటా మొత్తం కార్ల విక్రయాల్లో 56 శాతం పైగా నమోదైంది. కానీ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఇది క్రమంగా తగ్గుతోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా కార్ల విభాగంలో 54 పైచిలుకు మోడల్స్‌ ఉండగా ప్రస్తుతం 39 స్థాయికి పడిపోయింది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి తక్కువ ధర కార్ల సెగ్మెంట్‌లో కొత్త మోడల్స్‌ ఆవిష్కరణ కూడా పెద్దగా లేదు. 

ఖరీదైన కార్ల విభాగంలో బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్స్‌ అయిన హ్యుందాయ్‌ క్రెటా, మారుతీ ఎర్టిగా, హోండా సిటీ మొదలైన వాటి వాటా 2019లో దాదాపు 68 శాతం ఉండేది. వాటి విక్రయాలు తర్వాత కాస్త తగ్గినా కొత్త అప్‌గ్రేడ్స్‌ ఆ ఖాళీని భర్తీ చేస్తున్నాయి. కియా సెల్టోస్, మారుతి ఎక్స్‌ఎల్‌6, ఎంజీ హెక్టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, హ్యుందాయ్‌ అల్కజర్‌ మొదలైన మోడల్స్‌ అమ్మకాలు గణనీయ స్థాయిలో ఉన్నాయి. ఇక గడిచిన 5–6 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 70,000 పైగా ధర ఉన్న టూ–వీలర్ల విక్రయాలు నిలకడగా అధిక స్థాయిలో నమోదవుతున్నట్లు క్రిసిల్‌ తెలిపింది. కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారుతుండటంతో దానికి అనుగుణంగా తయారీ సంస్థలు కూడా అధిక రేట్ల వాహనాలపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించింది. 2015 ఆర్థిక సంవత్సరంలో తక్కువ రేట్ల విభాగంలో 29 మోడల్స్‌ ఉండగా ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నాయని తెలిపింది. దానికి విరుద్ధంగా అధిక ధర సెగ్మెంట్‌లో మోడల్స్‌ సంఖ్య 71 నుంచి 93కి పెరిగినట్లు  వివరించింది.

చదవండి👉 పాప్‌ స్టార్‌ జస్టిన్‌ బీబర్‌కు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు