ఫిబ్రవరిలో పెరిగిన ఉపాధి కల్పన.. కొత్తగా 14.12 లక్షల మంది

21 Apr, 2022 13:18 IST|Sakshi

 ఈపీఎఫ్‌వో కిందకు అదనంగా 14 లక్షల మంది 

ఏడాది క్రితంతో పోలిస్తే 14 శాతం అధికం 

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి 2022 ఫిబ్రవరిలో కొత్తగా 14.12 లక్షల మంది వచ్చి చేరారు. 2021 ఫిబ్రవరిలో కొత్త సభ్యులు 12.37 లక్షల మందితో పోలిస్తే 14 శాతం వృద్ధి కనిపించింది. ఈ మేరకు ప్రొవిజన్‌ పేరోల్‌ గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. ఈపీఎఫ్‌వో డేటాను గమనిస్తే.. పిబ్రవరిలో చేరిన నికర సభ్యుల్లో మహిళలు 3.10 లక్షలుగా ఉన్నారు. అంటే మొత్తం సభ్యుల్లో వీరు 22 శాతంగా ఉన్నారు. గత ఆర్థిక సంవత్సంలో 2021 ఏప్రిల్‌ నుంచి 2022 ఫిబ్రవరి వరకు మొత్తం నికర సభ్యుల నమోదు 1.11 కోట్లుగా ఉంది. అదే అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020–21 మొత్తం మీద నికర సభ్యుల నమోదు 77.08 లక్షలుగానే ఉండడం గమనార్హం. 2019–20లో ఇది 78.58 లక్షలుగా ఉంది.  

జనవరితో పోలిస్తే స్వల్ప వృద్ధి 
నెలవారీగా చూస్తే 2022 జనవరితో పోలిస్తే నికర సభ్యుల నమోదు 31,826 మేర అధికంగా ఫిబ్రవరిలో కనిపించింది. వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 2022 ఫిబ్రవరిలో 1,74,314 మంది అధికంగా చేరినట్టు తెలుస్తోంది. 2021 అక్టోబర్‌ నుంచి నికర సభ్యుల చేరిక క్రమం గా పెరుగుతూ వస్తున్నట్టు కార్మిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. 2022 ఫిబ్రవరిలో నికరంగా చేరిన సభ్యులు 14.12 లక్షల మందిలో 8.41 లక్షల మం ది ‘ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అండ్‌ మిస్‌లేనియస్‌ ప్రొవిజన్స్‌ యాక్ట్, 1952’ కింద చేరారు. అంటే ఈ మేరకు అదనపు ఉపాధి అవకాశాలు లభించిట్టు భావించొచ్చు. మిగిలిన 5.71 లక్షల మంది ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థలో చేరిన వారే. వీరు తమ ఖాతాలను కొత్త సంస్థకు బదిలీ చేసుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఢిల్లీ నుంచి చేరిన సభ్యులు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాల నుంచి నికరంగా చేరిన వారి సంఖ్య 9.52 లక్షలు.  

చదవండి: అలా చేస్తే దేశ ప్రయోజనాలకు విఘాతం 

మరిన్ని వార్తలు