మార్చిలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లపై సీబీటీ కీలక సమావేశం..!

13 Feb, 2022 17:31 IST|Sakshi

ఈపీఎఫ్ఓకి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వచ్చే నెలలో గౌహతిలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో 22021-22కి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ 5 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత మార్చి రెండో వారంలో గౌహతిలో సమావేశం కానుంది. వడ్డీ రేటు, కొత్త ఉత్పత్తులలో పెట్టుబడి తదితర విషయాల గురించి సమావేశంలో చర్చించనుంది.

2020-21లో పీఎఫ్ డిపాజిట్ల వడ్డీ రేటును నిర్ణయించిన విధంగా 2021-22కు 8.5 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ అందిస్తుందా అని మీడియా అడిగినప్పుడు కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానమిస్తూ.. ఆర్థిక సంవత్సరం ఆదాయ అంచనా ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. 2020-21 నాటికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీరేటును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 2021 మార్చిలో నిర్ణయించింది.

దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2021లో ఆమోదించింది. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ 2020-21కు వడ్డీ ఆదాయాన్ని 8.5 శాతంగా చందాదారుల ఖాతాలోకి క్రెడిట్ చేయాలని ప్రాంత కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును సీబీటీ నిర్ణయించిన తర్వాత, ఈ వడ్డీ రేటు సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ మేరకు ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును చందాదారుల ఖాతాలో జమ చేస్తుంది.

(చదవండి: విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏసియా శుభవార్త..!)

మరిన్ని వార్తలు