ఆ ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్రం శుభవార్త!

12 Sep, 2021 18:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఈశాన్య సంస్థలు, కొన్ని ప్రత్యేక కేటగిరీ సంస్థలకు ఆధార్ నెంబర్‌తో యుఏఎన్ లింకు గడువును డిసెంబర్ 31, 2021 వరకు పొడగించింది. ఈశాన్య ప్రాంతంలో ఇంకా చాలా మంది ఆధార్ నెంబర్‌తో యుఏఎన్ లింకు చేయకపోవడంతో గడువు పొడగించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. 220 మిలియన్లకు పైగా ఖాతాలు, ₹12 లక్షల కోట్ల కార్పస్ నిధి గల ఈపీఎఫ్ఓ ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. (చదవండి: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై స్పష్టతనిచ్చిన ఆపిల్‌..!)

ఈపీఎఫ్ ఖాతా యుఏఎన్ నెంబర్‌తో ఆధార్ ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. దీని కోసం, ఈపీఎఫ్ఓ ​​సామాజిక భద్రత కోడ్ 2020 సెక్షన్ 142లో కొన్ని కీలక మార్పులు చేసింది. ఇక నుంచి పీఎఫ్ మెంబర్లు సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఏదైనా ప్రయోజనాన్ని పొందాలంటే ఆధార్ నంబర్-యుఏఎన్ లింకింగ్ తప్పనిసరి అని పేర్కొంది. రెండింటిని లింక్ చేయనివారికి పీఎఫ్ కంట్రిబ్యూషన్ అందకపోవడమే కాదు.. ఇతర ఈపీఎఫ్ఓ సేవలు ఆగిపోతాయని సంస్థ పేర్కొంది. పెన్షన్ ఫండ్‌ నుంచి డబ్బు తీసుకోవడం కూడా కష్టమవుతుంది. వాస్తవానికి, గతంలో ఈపీఎఫ్ఓ ఉద్యోగులందరికీ ఆధార్ నెంబర్‌తో యుఎఎన్ ను లింక్ చేయడానికి చివరి తేదీగా సెప్టెంబర్ 1, 2021 అని పేర్కొంది. కానీ ఇప్పుడు డిసెంబర్ 31 వరకు పొడగించింది.

మరిన్ని వార్తలు