జూలైలో 18 లక్షల మందికి ఉపాధి

21 Sep, 2022 09:26 IST|Sakshi

కొత్తగా చేరిన సభ్యులు 

ఈపీఎఫ్‌వో పేరోల్‌ విడుదల

న్యూఢిల్లీ: సంఘటిత రంగంలో కొత్తగా 18.23 లక్షల మందికి జూలైలో ఉపాధి లభించింది. ఇంత మంది సభ్యులు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పేరోల్‌లో సభ్యులుగా చేరారు. ఈ మేరకు గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ మంగళవారం విడుదల చేసింది. 2021 జూలై నెలకు సంబంధించి కొత్త సభ్యుల సంఖ్యతో పోలిస్తే 25 శాతం వృద్ధి ఉన్నట్టు తెలిపింది. ఇక జూలైలో కొత్త సభ్యులు 18.23 లక్షల మందిలో నికరంగా మొదటిసారి ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చిన వారు 10.58 లక్షలుగా ఉన్నారు. మిగిలిన వారు ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థలో చేరిన వారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈపీఎఫ్‌వో సభ్యుల చేరికలో వృద్ధి కనిపిస్తూనే ఉంది.  కొత్త సభ్యుల్లో 57.69 శాతం మంది 18–25 వయసులోని వారున్నారు. మహిళా సభ్యుల సంఖ్య 4.06 లక్షలుగా ఉంది. 2021 జూలైలో మహిళా సభ్యుల చేరికతో పోలిస్తే 35 శాతం పెరిగింది. జూలైలో మొత్తం కొత్త సభ్యుల్లో మహిళల శాతం 27.54 శాతంగా ఉంది. గడిచిన 12 నెలల్లోనే ఇది అత్యధికం. సంఘటిత రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో నికర సభ్యుల చేరిక పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల నుంచే 12.46 లక్షల మంది సభ్యులు చేరడం గమనార్హం. మొత్తం సభ్యుల చేరికలో ఈ రాష్ట్రాల వాటా 68 శాతంగా ఉంది.

చదవండి: India WinZo: ఇది కేవలం కొందరి కోసం.. గూగుల్‌ పాలసీ సరికాదు

మరిన్ని వార్తలు