ఈక్విటీ ఫండ్స్‌లో తగ్గిన పెట్టుబడులు!

10 Sep, 2022 09:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక క్రమంగా తగ్గుతోంది. ఆగస్ట్‌లో కేవలం రూ.6,120 కోట్ల వరకే వచ్చాయి. అంతకు ముందు నెలలో (జూలై) వచ్చిన రూ.8,898 కోట్లతో పోలిస్తే 30 శాతం తగ్గాయి. 

అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.15,890 కోట్లు, మే నెలలో రూ.18,529 కోట్లు, జూన్‌లో రూ.15,495 కోట్ల చొప్పున వచ్చిన పెట్టుబడులు.. తర్వాతి రెండు నెలల్లో గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే.. ఆగస్ట్‌లో వచ్చిన పెట్టుబడులు 2021 అక్టోబర్‌ (రూ.5,215 కోట్లు) తర్వాత అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అయితే, ఈక్విటీల్లోకి నికర పెట్టబుడుల రాక 18వ నెలలోనూ నమోదైంది.  

సిప్‌ ద్వారా రూ.12,693 కోట్లు..: ఫ్లెక్సీక్యాప్, లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్, మిడ్‌కాయ్ప్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. కొత్త పథకాల ఆవిష్కరణపై సెబీ నియంత్రణ ఎత్తివేయడంతో ఏఎంసీలు పలు కొత్త పథకాల ద్వారా నిధులు సమీకరించాయి. హైబ్రిడ్‌ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.6,601 కోట్లను వెనక్కి తీసుకున్నారు. బంగారం ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ నుంచి రూ.38 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఆగస్ట్‌లో రూ.12,693 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్‌ ఖాతాల సంఖ్య అత్యంత గరిష్ట స్థాయి 5.71 కోట్లకు చేరింది.  

డెట్‌లోకి భారీగా.. 
ఇక డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ఆగస్ట్‌లో   రూ.49,164 కోట్లు వచ్చాయి. జూలైలో వచ్చిన రూ.4,930 కోట్లతో పోలిస్తే పది రెట్లు పెరిగాయి.  

మరిన్ని వార్తలు