ఈక్విటీల్లోకి రూ.14,000 కోట్లు

11 Oct, 2022 06:32 IST|Sakshi

దాదాపు అన్ని విభాగాల్లోకి పెట్టుబడులు

డెట్‌ ఫండ్స్‌లోకి రూ.65,373 కోట్లు

రూ.39.88 లక్షల కోట్లకు ఫండ్స్‌ ఆస్తులు

ముంబై: మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ సెప్టెంబర్‌ నెలలోనూ పురోగతి చూపించింది. ఈక్విటీ పథకాలు గత నెలలో నికరంగా రూ.14,100 కోట్లను ఆకర్షించాయి. దాదాపు అన్ని రకాల ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు వచ్చాయి. సెక్టోరల్‌ పథకాల్లోకి అత్యధికంగా రూ.4,418 కోట్లు వచ్చాయి. ఈక్విటీల్లో ప్యాసివ్‌ ఫండ్స్‌ రూ.13,623 కోట్లను ఆకర్షించ గా, ఈటీఎఫ్‌లు రూ.10,808 కోట్లను రాబట్టాయి. మిడ్‌క్యాప్, ఫ్లెక్సీక్యాప్‌ విభాగాలు ఒక్కోటీ రూ. 2,000 కోట్లకు పైనే పెట్టుబడులను ఆకర్షించాయి.

డెట్‌ విభాగంలోకి రూ.65,373 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డెట్‌లో మనీ మార్కెట్, లిక్విడ్‌ ఫండ్స్‌ పథకాలకు ఆదరణ లభించింది. అన్ని ఏఎంసీల పరిధిలోని నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్‌ చివరికి రూ.39.88 లక్షల కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఉన్న రూ.3 6.73 లక్షల కోట్లతో పోలిస్తే 8 శాతానికి పైగా ఏయూఎం పెరిగింది. ఇక ఈ ఏడాది ఆగస్ట్‌ చివరికి ఉన్న రూ.39.33 లక్షల కోట్ల నుంచి స్వల్పంగా వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) సెప్టెంబర్‌ నెలకు సంబంధించి తాజా గణాంకాలను సోమవారం విడుదల చేసింది.  

సిప్‌ పెట్టుబడులు..
సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో పెట్టుబడులు సెప్టెంబర్‌లో కొత్త శిఖరాలకు చేరాయి. రూ.12,976  కోట్ల పెట్టుబడులు సిప్‌ రూపంలో వచ్చాయి. ఆగస్ట్‌లో ఇలా వచ్చిన పెట్టుబడులు12,694 కోట్లుగా ఉన్నాయి. సిప్‌ ఖాతాలు కూడా 5.84 కోట్లకు పెరిగాయి. సిప్‌ ఖాతాలకు సంబంధించి మొత్తం నిర్వహణ ఆస్తులు రూ.6.39 లక్షల కోట్లకు చేరాయి. పరిశ్రమ వ్యాప్తంగా ఫోలియోల సంఖ్య 13.81 కోట్లకు చేరుకుంది. ఒక పథకంలో ఇన్వెస్టర్‌ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు నంబర్‌/ఖాతాను ఫోలియోగా చెబుతారు.

సిప్‌ మరింత బలపడుతుంది..
సిప్‌ రూపంలో సెప్టెంబర్‌లో వచ్చిన మొత్తం రూ.12,976 కోట్లకు చేరుకుందని, రానున్న నెలల్లో ఈ మొత్తం రూ.13వేల కోట్లను దాటుతుందని యాంఫి సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ తెలిపారు. గత కొన్ని నెలలుగా మార్కెట్‌ ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు ఒత్తిళ్లను ఎదుర్కొన్నట్టు చెప్పారు. అయినప్పటికీ చిన్న ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ఫండ్స్‌ పెట్టుబడుల పట్ల నమ్మకాన్ని చూపించినట్టు తెలిపారు. సిప్‌ను దీర్ఘకాలంలో సంపద సృష్టికి సాధనంగా వారు చూస్తున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు