ఈక్విటీ ఫండ్స్‌లో రికార్డు స్థాయి పెట్టుబడులు

11 Mar, 2023 03:51 IST|Sakshi

ఫిబ్రవరిలో రూ.15,685 కోట్లు

తొమ్మిది నెలల గరిష్టం

డెట్‌ పథకాల నుంచి ఉపసంహరణ

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి పెట్టుబడులు కొత్త గరిష్టానికి చేరాయి. ఫిబ్రవరి నెలలో నికరంగా రూ.15,685 కోట్లను ఈక్విటీ పథకాలు ఆకర్షించాయి. ఇది తొమ్మిది నెలల గరిష్ట స్థాయి. 2022 మే నెలకు వచ్చిన రూ.18,529 కోట్లు ఇప్పటి వరకు గరిష్ట స్థాయిగా ఉంది. ఈ ఏడాది జనవరి నెలలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన రూ.12,546 కోట్లతో పోల్చినా, గత డిసెంబర్‌ నెలకు వచ్చిన రూ.7,303 కోట్లతో పోల్చినా గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. ఈక్విటీ పథకాల్లో గత 24 నెలలుగా నికరంగా పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి.

ఫిబ్రవరి నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) విడుదల చేసింది. డెట్‌ విభాగం నుంచి ఇన్వెస్టర్లు ఫిబ్రవరిలో రూ.13,815 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఫిబ్రవరి నెలకు మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.9,575 కోట్లకు పరిమితం అయ్యాయి. ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు ఎక్కువగా ఉండడంతో ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ను మెరుగైన మార్గంగా భావించడం అధిక పెట్టుబడుల రాకకు మద్దతుగా నిలిచింది.

విభాగాల వారీగా..   
► సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రూపంలో రూ.14,000 కోట్లు వచ్చాయి. 2022 అక్టోబర్‌ నుంచి నెలవారీ సిప్‌ పెట్టుబడులు రూ.13వేల కోట్లకు పైనే ఉంటున్నాయి.
► 11 కేటగిరీల్లో సెక్టోరల్‌/థీమ్యాటిక్‌ ఫండ్స్‌ అత్యధికంగా రూ.3,856 కోట్లు ఆకర్షించాయి. ఆ తర్వాత స్మాల్‌క్యాప్‌ పథకాల్లోకి
రూ.2,246 కోట్లు వచ్చాయి.
► మల్టీక్యాప్‌ ఫండ్స్‌ రూ.1977 కోట్లు, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.1,816 కోట్లు, ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ రూ.1,802 కోట్లు, లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.1,651 కోట్ల చొప్పున పెట్టుబడులను ఫిబ్రవరి నెలలో ఆకర్షించాయి.  
► ఇండెక్స్‌ ఫండ్స్‌లోకి రూ.6,244 కోట్లు వచ్చాయి.  
► గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు)లోకి రూ.165 కోట్లు వచ్చాయి.  
► డెట్‌ విభాగంలో లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచి రూ.11,304 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫథకాల
నుంచి రూ.2,430 కోట్లు, లో డ్యురేషన్‌ ఫండ్స్‌ నుంచి రూ.1,904 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు.
► 42 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తులు రూ.39.46 లక్షల కోట్లుగా ఉంది. జనవరి చివరికి ఇది రూ.39.62 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం.

క్రమశిక్షణగా పెట్టుబడులు
‘‘విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల విక్రయాలతో అస్థిరతలు నెలకొన్నప్పటికీ, ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించారు. డివిడెండ్‌ ఈల్డ్, ఫోకస్డ్‌ ఫండ్స్, లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ మినహా మిగిలిన అన్ని ఈక్విటీ విభాగాల్లో వచ్చిన పెట్టుబడులు రూ.700 కోట్లపైనే ఉన్నాయి’’అని ఫయర్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ గోపాల్‌ కావలిరెడ్డి తెలిపారు. వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి పెరుగుతాయనే అంచనాలతో డెట్‌ ఫండ్స్‌ నుంచి పెట్టుబడులు బయటకు వెళుతున్నట్టు చెప్పారు. ‘‘మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నప్పటికీ స్మాల్, మిడ్‌క్యాప్‌ క్యాప్‌ ఫండ్స్‌ భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ఆకట్టుకునే విధంగా ఉంది. దీర్ఘకాలంలో ఈ పథకాలు అద్భుతమైన రాబడులను అందించగలవు’’అని ఫిన్‌ ఎడ్జ్‌ సీఈవో హర్‌‡్ష గెహ్లాట్‌ అన్నారు.

మరిన్ని వార్తలు