బంగారం కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ధరలు..!

22 Feb, 2022 17:41 IST|Sakshi

గత కొద్ది రోజుల నుంచి పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగి పెరిగాయి. ఇందుకు ప్రధాన కారణం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇవాళ తిరుగుబాటు నేతలతో క్లెమ్లిన్‌లో సమావేశమై..డోనెట్‌స్క్‌, లుగన్‌స్క్‌లను(ఉక్రెయిన్‌ రెబల్‌ ప్రాంతాలు) స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించడంతోనే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తొమ్మిది నెలల గరిష్టానికి చేరుకున్నాయి. స్పాట్ బంగారం 0.2% పెరిగి ఔన్స్‌కు $1,909.54 వద్ద ఉంటే.. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.7% లాభపడి 1,913.60 డాలర్లకు చేరుకుంది. 

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసిఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర 0.72 శాతం పెరిగి రూ.50,440 వద్ద ఉంటే, వెండి 1.08 శాతం పెరిగి కిలోగ్రాముకు రూ.64,275 వద్ద ట్రేడవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ వివాదం వల్ల బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్‌ గోల్డ్‌ 999) బంగారం ధర సుమారు రూ.600కి పైగా పెరిగి రూ.50,547కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.45,743 నుంచి రూ.46,301కు చేరుకుంది.

 

ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.45,900 నుంచి రూ.46,250కు తగ్గింది. అంటే ఒక్కరోజులో రూ.300 పెరిగింది అన్నమాట. ఇక బిస్కెట్‌ గోల్డ్‌ బంగారం ధర రూ.410 పెరిగి రూ.50,460కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.1100కి పైగా పెరిగి రూ.64,656కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. 

(చదవండి: వాహనదారులకు షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!)

మరిన్ని వార్తలు