ఎస్కార్ట్స్‌- లారస్‌ ల్యాబ్స్‌.. గెలాప్‌‌

28 Sep, 2020 14:06 IST|Sakshi

సెన్సెక్స్‌ 550 పాయింట్లు అప్‌

క్యుబోటా ట్రాక్టర్ల తయారీ షురూ

ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ 8 శాతం హైజంప్‌

ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాన్ని తాకిన షేరు

షేర్ల విభజన నేపథ్యం- 9 శాతం ఎగసిన లారస్‌ ల్యాబ్స్

ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 550 పాయింట్లు జంప్‌చేసి 37,938కు చేరింది. కాగా.. క్యుబోటా కార్పొరేషన్‌ భాగస్వామ్యంలో ట్రాక్టర్ల తయారీని ప్రారంభించినట్లు వెల్లడించడంతో ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు షేర్ల విభజనకు బుధవారం(30న) రికార్డ్‌ డేట్‌కావడంతో  ఫార్మా రంగ కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. 

ఎస్కార్ట్స్‌ లిమిటెడ్
జపనీస్‌ దిగ్గజం క్యుబోటా కార్పొరేషన్‌తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ(జేవీ) ఎస్కార్ట్స్‌ క్యుబోటా ఇండియా ట్రాక్టర్ల తయారీని ప్రారంభించినట్లు ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. ఈ జేవీలో క్యుబోటా 60 శాతం, ఎస్కార్ట్స్‌ 40 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. రూ. 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన జేవీ ఏడాదికి 50,000 ట్రాక్టర్లను రూపొందించగలదని వెల్లడించింది. ఈ యూనిట్‌ను ప్రధానంగా ఎగుమతులకు వినియోగించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎస్కార్ట్స్‌ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం జంప్‌చేసింది. రూ.  1,300ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.4 శాతం లాభంతో రూ. 1,292 వద్ద ట్రేడవుతోంది.

లారస్‌ ల్యాబ్స్‌
చిన్న ఇన్వెస్టర్లకు సైతం అందుబాటులో ఉండేందుకు వీలుగా షేర్ల విభజనను ప్రకటించిన లారస్‌ ల్యాబ్స్‌ షేరు మంగళవారం నుంచీ ఎక్స్‌డేట్‌కానుండటంతో జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత 9.2 శాతం దూసుకెళ్లింది. రూ. 1,450 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 8.8 శాతం ఎగసి రూ. 1,445 వద్ద ట్రేడవుతోంది. జులై 30న సమావేశమైన లారస్‌ ల్యాబ్స్‌ బోర్డు 5:1 నిష్పత్తిలో షేర్ల విభజనను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు ఈ నెల 30 రికార్డ్‌ డేట్‌కావడంతో మంగళవారం నుంచీ షేరు ధర ఇందుకు అనుగుణంగా సర్దుబాటు కానుంది.

మరిన్ని వార్తలు