ESG: పెట్టుబడి.. పదికాలాలు పచ్చగా!

26 Sep, 2022 04:46 IST|Sakshi

ఈఎస్‌జీ థీమ్‌కు పెరుగుతున్న ఆదరణ

అన్నీ తెలుసుకున్నాకే ఇన్వెస్ట్‌ చేయాలి...

దేశీయంగా అందుబాటులో 10 ఫండ్స్‌

వీటిల్లో మోస్తరుగానే రాబడులు

నిబంధనలను కఠినం చేస్తున్న సెబీ

దీర్ఘకాలంలోనే మెరుగైన ఫలితాలు

అసలు పెట్టుబడి ఉద్దేశం రాబడే కదా..? ఈ రాబడి కాంక్షే ఇన్వెస్టర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటుంది. కానీ, నేడు భూ మండలం వాతావరణ మార్పులు అనే పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వనరుల వినియోగం గరిష్ట స్థాయికి చేరి, కాలుష్యం అసాధారణ స్థాయికి చేరిపోయిన తరుణంలో.. పర్యావరణంపై మమకారంతో పుట్టుకొచ్చిందే ఈఎస్‌జీ (ఎన్విరాన్‌మెంట్, సోషల్, గవర్నెన్స్‌) విధానం. తాము పెట్టుబడి కోసం ఎంపిక చేసుకుంటున్న కంపెనీ.. పర్యావరణాన్ని ఏ రకంగా చూస్తోందన్నది ఇన్వెస్టర్‌కు కీలకం అవుతుంది. అంటే పర్యావరణానికి తన ఉత్పత్తులు, తయారీ, సేవల ద్వారా హాని కలిగించకూడదు. తన ఉద్యోగులు, భాగస్వాములతో ఎలా వ్యవహరిస్తుందన్నది ‘సోషల్‌’. ఇక కంపెనీ నిర్వహణ తీరుకు అద్దం పట్టేదే గవర్నెన్స్‌. ఈ మూడింటిలో పాస్‌ మార్కులు పొందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే ఈఎస్‌జీ ఇన్వెస్టింగ్‌. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో పాపులర్‌ అవుతున్న ఈ విధానం పట్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు కూడా ఆకర్షితులవుతున్నారు. అయితే, ఇందులో కొన్ని పరిమితులు ఉన్నాయి. దేశీయంగా ఇంకా పూర్తి స్థాయిలో పరిణతి చెందలేదు. కనుక ఈఎస్‌జీ థీమ్‌ పట్ల ఆసక్తితో ఉన్న ఇన్వెస్టర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో సమగ్రంగా వివరించే కథనమిది...

ప్రపంచవ్యాప్తంగా ఈఎస్‌జీ పెట్టుబడులు 2020 నాటికే 35 ట్రిలియన్‌ డాలర్లు (రూ. 2800 లక్షల కోట్లు) దాటాయంటే దీని ప్రాధాన్యం ఏ మేరకో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ తరహా పర్యావరణ అనుకూల పెట్టుబడి విధానం కొత్తదేమీ కాదు. కాకపోతే దీని రూపం మారింది. గ్రీన్‌ ఇన్వెస్టింగ్, సామాజిక బాధ్యతా పెట్టుబడి విధానం, సుస్థిర పెట్టుబడి అన్నవి ఈఎస్‌జీని పోలినవే. ఈ తరహా పెట్టుబడులన్నింటినీ ఏకం చేసింది ఈఎస్‌జీ. ఇప్పుడు ఈఎస్‌జీ అనుకూలం. ఈఎస్‌జీ వ్యతిరేకం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కంపెనీలను చూస్తున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ప్రత్యేకంగా ఈఎస్‌జీ ఫండ్స్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి.

పెట్టుబడులు భిన్నం..
కంపెనీలు ఏ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయనే దానికంటే.. ఏ విధంగా లాభాలను పొందుతున్నాయన్నది ఈఎస్‌జీ విధానంలో కీలకం. పర్యావరణానికి హాని తలపెట్టకుండా, వీలైతే మేలు చేస్తూ, చక్కని లాభాలను పోగేస్తున్న కంపెనీలకు ఈ విధానంలో మంచి డిమాండ్‌ ఉంటుంది. కేవలం గత రెండు సంవత్సరాల్లోనే సుమారు 32 బిలియన్‌ డాలర్లు (రూ.2.56 లక్షల కోట్లు) ఈఎస్‌జీ ఆధారిత యూఎస్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులుగా వెళ్లాయి. ముందే చెప్పుకున్నట్టు ఈ పెట్టుబడికి సామాజిక స్పృహ ఎక్కువ. కనుక రాబడుల విషయంలో కొంత రాజీ పడక తప్పదు. ఎంఎస్‌సీఐ వరల్డ్‌ ఈఎస్‌జీ ఇండెక్స్‌ రాబడులను పరిశీలిస్తే.. గత 10 ఏళ్లలో రెట్టింపైంది. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన సార్వత్రిక నిబంధనలు, ప్రమాణాలు ఈఎస్‌జీకి లేవు. అలాగే ఏకీకృత నిర్వచనం, విధానం కూడా లేవు.

అసలు ఈఎస్‌జీ పేరుతో మూలసూత్రాలకు విరుద్ధంగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని ఈఎస్‌జీ ఈక్విటీ ఫండ్స్‌.. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత చమురు ధరల పెరుగుదలతో షెల్, రెప్సోల్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెంచుకున్నాయి. కాగా, పెట్టుబడులపై భవిష్యత్తులో మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫండ్స్‌ మేనేజర్ల పెట్టుబడుల విధానాలకు, ఈఎస్‌జీ సూత్రాలు ఏ విధంగా సరిపోలుతున్నాయో వెల్లడించేలా త్వరలో యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్చంజ్‌ కమిషన్‌ మార్గదర్శకాలను అమల్లోకి తీసుకురానుంది. అలాగే, సెబీ సైతం ఫండ్స్‌ ఈఎస్‌జీ పథకాలకు సంబంధించి వెల్లడించాల్సిన సమాచారం విషయమై విస్తృతమైన సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేయడం గమనించదగిన అంశం.

కొంచెం జాగ్రత్త అవసరం..
ఈఎస్‌జీ స్టాక్స్‌కు మార్కెట్‌ కొంచెం ప్రీమియం వ్యాల్యూషన్‌ ఇస్తుంటుంది. దీంతో కొన్ని కంపెనీలు ఈఎస్‌జీ థీమ్‌ను దుర్వినియోగం చేస్తున్నాయి. తమ ఉత్పత్తులు పర్యావరణం అనుకూలమని తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తరహా ధోరణలను అరికట్టేందుకు నూతన పర్యావరణ నిబంధనలను కేంద్రం అమల్లోకి తీసుకురానుంది. దీని కింద కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కాలుష్య విడుదలకు సంబంధించి మరింత సమాచారం, వివరాలను వెల్లడించాలి. ఈఎస్‌జీ రేటింగ్‌ కోసం థర్డ్‌ పార్టీ సంస్థలపైనే కంపెనీలు ఆధారపడాల్సి వస్తోంది. సార్వత్రిక బెంచ్‌ మార్క్‌ లేదా పద్ధతి అనేది ఈఎస్‌జీ రేటింగ్‌లకు అమల్లో లేదు. కేంద్ర నూతన నిబంధనలు, సెబీ సంప్రదింపుల పత్రం తర్వాత విడు దల చేసే మార్గదర్శకాలతో ఈఎస్‌జీ థీమ్‌ మరింత పటిష్టం కానుంది. పెట్టుబడులకు ముందు ఆయా అంశాలపై అవగాహన అవసరం.

ఈఎస్‌జీ స్కోర్‌ ఎలా?
ఎన్విరాన్‌మెంట్‌
కంపెనీ కార్యకలాపాలు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలు? గతంలో ఇలాంటి లక్ష్యాలను ఏ మేరకు సాధించింది? ఏ మేరకు ఇంధనాన్ని వినియోగిస్తోంది? పునరుత్పాదక ఇంధన వనరులను ఏర్పాటు చేసుకుందా? నీటి వినియోగం, కాలుష్యం విడుదల, వ్యర్థాల నిర్వహణ ఇలాంటి అంశాలన్నీ ఈఎస్‌జీ స్కోర్‌కు ముందు థర్డ్‌ పార్టీ సంస్థలు చూస్తాయి.

సోషల్‌
ఉద్యోగులతో కంపెనీకి ఉన్న అనుబంధం, వారి భద్రతకు, ఆరోగ్యానికి తీసుకున్న చర్యలు, సమాజంతో ఉన్న సంబంధాలు, భాగస్వాములతో సంబంధాలను అధ్యయనం చేస్తారు. భాగస్వాములు, ఉద్యోగులు అందరినీ ఏకరీతిన చూసేందుకు వీలుగా కంపెనీలు అమలు చేస్తున్న విధానాలు, పద్ధతులను పరిశీలించడం జరుగుతుంది. నాణ్యత, సైబర్‌ సెక్యూరిటీ, డేటా భద్రత చర్యలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.

గవర్నెన్స్‌
కంపెనీ బోర్డు నిర్మాణం ఎలా ఉంది? నిపుణులు, మహిళలకు చోటు కల్పించారా? బోర్డు కమిటీల ఏర్పాటు, బోర్డు పనితీరు, అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలు, స్టాట్యుటరీ ఆడిటర్లు, ఆడిట్, ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ను కూడా పరిశీలిస్తారు.

దేశీయంగా... ఇంకా ఆరంభ దశలోనే
దేశీయంగా ఈఎస్‌జీ థీమ్‌ ఇంకా ఆరంభ దశలోనే ఉందని చెప్పుకోవచ్చు. కనుక రిటైల్‌ ఇన్వెస్టర్లు నేరుగా ఈఎస్‌జీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం రిస్క్‌తో కూడుకున్నదే. ఎందుకంటే ఇది లోతైన అంశం. విస్తృత సమాచారాన్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఎస్‌ఈఎస్‌ (స్టేక్‌ హోల్డర్స్‌ ఎంపవర్‌మెంట్‌ సర్వీసెస్‌) తదితర కొన్ని ఉచిత వేదికలు ఈఎస్‌జీ కంపెనీలకు సంబంధించి ర్యాంకులను ప్రకటిస్తున్నాయి. ఇతర సంస్థల నుంచి ఈఎస్‌జీ కంపెనీల వివరాలు పొందాలంటే కొంత చెల్లించుకోవాల్సి వస్తుంది. నేరుగా కంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ రూట్‌ నయం. ప్రస్తుతం 10 వరకు ఈఎస్‌జీ ఆధారిత థీమాటిక్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎనిమిది పథకాలు గత రెండేళ్లలో ప్రారంభమైనవే ఉన్నాయి. రెండు పథకాలు ప్యాసివ్‌గా (ఇండెక్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసేవి) పనిచేస్తున్నాయి. ఒక పథకం దీర్ఘకాలం నుంచి ఉన్నా కానీ, ఆరంభంలో ఈఎస్‌జీ పథకంగా లేదు.  

దీర్ఘకాలంలో వ్యాపార పరంగా నిలదొక్కుకోగలవా? ఈఎస్‌జీలో ఏ అంశాల పరంగా కంపెనీ మెరుగ్గా ఉంది? వాటిని ఇక ముందూ కొనసాగించగలదా? భవిష్యత్తు వృద్ధి అవకాశాలు ఇలాంటి అంశాలను సాధారణ ఇన్వెస్టర్‌ కంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశోధన బృందాలు మెరుగ్గా అంచనా వేయగలవు. ఇక ఈఎస్‌జీలో రెండు అంశాల్లో టిక్‌ మార్క్‌లు పడినా ఆయా కంపెనీలను సైతం ఫండ్స్‌ ఎంపిక చేసుకుంటున్నాయి. ఎందుకంటే పర్యావరణం, సోషల్, గవర్నెన్స్‌ మూడింటిలోనూ సరితూగే కంపెనీలు కొన్నే ఉంటున్నాయి. అలాంటప్పుడు అదనపు పెట్టుబడుల సర్దుబాటుకు వీలుగా రెండు అంశాల్లో మెరుగైన పనితీరు చూపిస్తున్న వాటిని కూడా ఫండ్స్‌ ఎంపిక చేసుకుంటున్నాయి. 2022 అక్టోబర్‌ 1 నుంచి బిజినెస్‌ రెస్పాన్స్‌బిలిటీ అండ్‌ సస్టెయిన్‌బిలిటీ రిపోర్ట్‌ (బీఆర్‌ఎస్‌ఆర్‌)ను విడుదల చేసే కంపెనీల్లోనే మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే నిర్వహిస్తున్న పెట్టుబడులకు 2023 సెప్టెంబర్‌ 30 వరకు సెబీ వెసులుబాటు కల్పించింది. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌లో (పీఎంఎస్‌) ఎస్‌బీఐ ఈఎస్‌జీ పోర్ట్‌ఫోలియో, అవెండస్‌ ఈఎస్‌జీ ఫండ్స్‌ పీఎంఎస్, వైట్‌ ఓక్‌ ఇండియా పయనీర్స్‌ ఈక్విటీ ఈఎస్‌జీ తదితర సంస్థల సేవలు అందుబాటులో ఉన్నాయి.

దీర్ఘకాలంలోనే రాబడులు..?
ఈఎస్‌జీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల కంటే నిఫ్టీ 100 ఈఎస్‌జీ ఇండెక్స్‌ పనితీరే కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. గత పదేళ్ల కాలంలో వార్షికంగా 15.25 శాతం కాంపౌండెడ్‌ రాబడిని ఈ సూచీ ఇచ్చింది. నిఫ్టీ 100 రాబడి కంటే ఇది ఒక శాతం ఎక్కువ. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులు మిశ్రమంగా ఉన్నాయి. ఏడాది కాలంలో రాబడులు మైనస్‌ 9 శాతం నుంచి ప్లస్‌ 27 శాతం మధ్య ఉన్నాయి. కానీ, మూడేళ్ల కాలంలో మాత్రం సానుకూల పనితీరు చూపించాయి. ఏడు పథకాలు ఏడాది కాలంలో నష్టాలను ఇవ్వడం గమనించాలి. సెక్టోరల్‌ ఫండ్స్‌.. ఫార్మా (12 శాతం డౌన్‌), ఐటీ (15 శాతం డౌన్‌) కంటే ఈఎస్‌జీ ఫండ్స్‌ కాస్త నయమనే చెప్పుకోవాలి. మార్కెట్లో ఒక్కో సైకిల్‌లో కొన్ని రంగాల షేర్లు ర్యాలీ చేయడం, కొన్ని ప్రతికూల రాబడులను ఇవ్వడం సాధారణంగా ఉండే పరిణామమే. ఈఎస్‌జీ పథకాలు రాబడులను ఇవ్వాలంటే పెట్టుబడులకు తగినంత వ్యవధి ఇవ్వాలన్నది మర్చిపోవద్దు.

పోర్ట్‌ఫోలియో భిన్నమేమీ కాదు..
ఈఎస్‌జీ థీమ్‌ పట్ల ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లు ముందుగా ఈఎస్‌జీ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోను పరిశీలించడం, అధ్యయనం చేయడం ద్వారా కొన్ని అంశాలను అయినా తెలుసుకునే వీలుంటుంది. ఈఎస్‌జీ ప్యారామీటర్లకు తూగే దేశీ స్టాక్స్‌ 200 వరకు, ఇంటర్నేషనల్‌ స్టాక్స్‌ 40 వరకు ఉంటాయి. ఇవన్నీ థీమ్యాటిక్‌ ఫండ్స్‌ కిందకు వస్తాయి. కనుక మొత్తం పెట్టుబడుల్లో 80 శాతాన్ని ఈఎస్‌జీ కంపెనీల్లోనే అవి ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం కూడా ఈఎస్‌జీ థీమ్‌కు పూర్తి వ్యతిరేకంగా ఉండకూడదని సెబీ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పోర్ట్‌ఫోలియోల్లో కనిపించే స్టాక్సే ఈఎస్‌జీ పథకాల్లోనూ కనిపించడం ఆశ్చర్యమేమీ కాదు. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), ఐటీ రంగ కంపెనీలు ఎక్కువ శాతం ఈఎస్‌జీ పథకాల్లో ప్రముఖంగా ఉన్నాయి. ఇవి పర్యావరణానికి హాని చేయకపోవడం, ప్రజల జీవనాన్ని సౌకర్యవంతం, మెరుగు చేయడం కోసం పనిచేస్తుంటాయి. కనుక వీటికి ఎక్కువ పథకాలు ఓటేస్తున్నాయి. 80 శాతం ఈఎస్‌జీ పథకాల్లో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ ప్రముఖ స్టాక్స్‌గా ఉన్నాయి. దాదాపు అన్ని ఈఎస్‌జీ పథకాల్లోనూ టాప్‌–10 హోల్డింగ్స్‌లో 4 నుంచి 9 వరకు అవే కంపెనీలు దర్శనమిస్తాయి. పీఎంఎస్, ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోలో సాధారణంగా కనిపించే ఇతర స్టాక్స్‌లో బజాజ్‌ ఫైనాన్స్, టైటాన్, హెచ్‌సీఎల్‌ టెక్, టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌యూఎల్‌ ఉన్నాయి.

మరిన్ని వార్తలు