ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ జూమ్‌- హెచ్‌ఏఎల్‌ స్కిడ్‌

1 Sep, 2020 14:59 IST|Sakshi

క్యూ1 ఫలితాల పుష్‌- ఎస్సెల్‌ 13 శాతం హైజంప్‌

ఓఎఫ్‌ఎస్‌ ఎఫెక్ట్‌- హెచ్‌ఏఎల్‌ షేరు 6 శాతం పతనం

గత 3 నెలల్లో 75 శాతం పెరిగిన ఎస్సెల్‌ ప్రొప్యాక్‌

ఇదే కాలంలో 60 శాతం ర్యాలీ చేసిన హెచ్‌ఏఎల్‌

కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఎఫ్‌ఎంసీజీ ప్రొడక్టుల ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ కౌంటర్‌ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఇటీవల ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొంతమేర వాటాను విక్రయించిన నేపథ్యంలో నేలచూపులతో కదులుతున్న ఇంజినీరింగ్‌ దిగ్గజం హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ లాభాలతో సందడి చేస్తుంటే.. హెచ్‌ఏఎల్‌ షేరు నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..

ఎస్సెల్‌ ప్రొప్యాక్
ఈ ఏడాది క్యూ1లో పటిష్ట ఫలితాలు సాధించాక మరింత జోరందుకున్న ఎస్పెల్‌ ప్రొప్యాక్ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 306ను తాకింది. ప్రస్తుతం 5.3 శాతం లాభంతో రూ. 285 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో కలిపి తొలి రెండు గంటల ట్రేడింగ్‌లోనే 4 లక్షల షేర్లు ఈ కౌంటర్లో చేతులు మారాయి. గత మూడు నెలల్లో ఈ కౌంటర్‌ 75 శాతం ర్యాలీ చేయడం విశేషం! క్యూ1లో ఎస్సెల్‌ ప్రొ నికర లాభం 14 శాతం పెరిగి రూ. 46 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 18 శాతం పుంజుకుని రూ. 741 కోట్లను తాకింది.  

హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్
వరుసగా నాలుగో రోజు హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ కౌంటర్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 3 శాతం క్షీణించి రూ. 898 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6 శాతం పతనమై రూ. 871 వరకూ నీరసించింది. గత నాలుగు రోజుల్లోనే ఈ షేరు 26 శాతం నష్టపోయింది. గత గురువారం(27న) కేంద్ర ప్రభుత్వం ఓఎఫ్‌ఎస్‌ ద్వారా 14.82 శాతం వాటాకు సమానమైన 49.56 మిలియన్‌ ఈక్విటీ షేర్లను విక్రయించిన విషయం విదితమే. ఇందుకు ఫ్లోర్‌ ప్రైస్‌ను రూ. 1001గా అమలు చేసింది. తద్వారా కంపెనీలో వాటాను 89.97 శాతం నుంచి 75.15 శాతానికి తగ్గించుకుంది. అయితే ఫ్లోర్‌ ప్రైస్‌ కంటే దిగువకు తాజాగా షేరు క్షీణించినప్పటికీ గత మూడు నెలల్లో ఈ కౌంటర్‌ 60 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!

మరిన్ని వార్తలు